పచ్చి గుడ్లు, ఒంటరిగా ఉండటమే నా సీక్రెట్...

22 Feb, 2015 14:39 IST|Sakshi
పచ్చి గుడ్లు, ఒంటరిగా ఉండటమే నా సీక్రెట్...

న్యూయార్క్: గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది తరచుగా అందరికీ వైద్యులు చెప్పేమాట. ఇదే మాట 115 ఏళ్ల 3 నెలల యూరప్ బామ్మ చెప్పింది. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా... పచ్చి గుడ్డు తాగడమే తన అధిక ఆయుష్షుకు కారణమంటుంది. దీంతో పాటు అధికకాలం ఒంటరిగా ఉండటం కూడా తన జీవితకాలాన్ని పెంచిందని యూరోప్ లోనే అధిక వయస్కురాలైన ఇటలీకి చెందిన బామ్మ ఎమ్మా మోరానో చెప్తోంది. ఇంకో విశేషమేమంటే ప్రపంచంలోనే అధిక వయసున్న వారి జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉంది.

తాను టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ డాక్టర్ గుడ్డు తాగమని ఆరోగ్యానికి మంచిదని ముఖ్యంగా ఎనీమియా తగ్గిస్తుందని సలహా ఇచ్చాడట... అప్పటినుంచి రోజుకు కచ్చితంగా 3 గుడ్లు తీసుకుంటున్నానని బామ్మ  తెలిపింది. ఇబ్బందులతో కూడిన తన వైవాహిక జీవితాన్ని 1938లో కూమారుడు చనిపోవడంతోనే వదులుకున్నానని ఆమె తెలిపింది. తనపై వేరొకరు పెత్తనం చేయడం ఇష్టం లేక రెండో పెళ్లి చేసుకోలేదని ఎమ్మా మోరానో  అన్నారు.

అప్పటి నుంచి వెర్బానియాలో కేవలం రెండు గదుల ఇంట్లో ఉంటున్నానని, కొన్నిసార్లు అనారోగ్యానికి గురయినప్పటికీ ఆసుపత్రిలో కాలుపెట్టడానికి నిరాకరించనన్నారు. ఎమ్మాకు రక్తం మార్పిడి చేయడం, ఇతర చికిత్స నిమిత్తం తానే ఆ ఇంటికి వెళ్లానని డాక్టర్ కార్లొ బవ తెలిపారు. ఆ బామ్మకు 90 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నానని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ చెప్పడం విశేషం.

>
మరిన్ని వార్తలు