19న ఇళ్లకు ‘థాయ్‌’ బాలురు

15 Jul, 2018 03:26 IST|Sakshi

మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దన్న వైద్యులు  

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లోని థామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ను ఆసుపత్రి నుంచి గురువారం (19న) ఇళ్లకు పంపనున్నారు. డిశ్చార్జి అయ్యాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలని వైద్యులు బాలురకు సూచించారు. ఆ గుహలో సంఘటనలను గుర్తు చేసుకోవడం వారి మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పారు. గత నెల 23న ‘వైల్డ్‌ బోర్స్‌’ అనే ఫుట్‌బాల్‌ జట్టు సభ్యులైన 12 మంది పిల్లలు (అందరి వయసు 11–16 ఏళ్ల మధ్య) సాధన తర్వాత తమ కోచ్‌తో కలిసి గుహలోకి సాహస యాత్రకు వెళ్లి చిక్కుకుపోగా వారందరినీ కాపాడటానికి 18 రోజులు పట్టడం తెలిసిందే.

కాగా, రెండు వారాలకు పైగా గుహలో ఉన్నందున ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారందరినీ ముందుగా వైద్యులు ఓ ప్రత్యేకమైన వార్డులో ఉంచారు. తాజాగా శనివారం థాయ్‌లాండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి పియసకోల్‌ సకోల్సత్తయతోర్న్‌ మాట్లాడుతూ ‘ఆ 12 మంది విద్యార్థులు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. వారందరినీ ఒకేసారి గురువారం ఇళ్లకు పంపిస్తాం’ అని చెప్పారు. కాగా, పిల్లలు తమను తాము పరిచయం చేసుకుంటున్న వీడియోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. కెమెరా ముందుకు వచ్చి తమ పేరు, తమకు ఇష్టమైనవి తదితర వివరాలు చెప్పుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నామని బాలురు వెల్లడించారు.

మరిన్ని వార్తలు