దుబాయ్‌లో ఘోర ప్రమాదం

8 Jun, 2019 04:12 IST|Sakshi
ప్రమాదానికి గురైన బస్సు

12 మంది భారతీయుల మృతి

బారికేడ్‌ను ఢీకొన్న బస్సు

మొత్తం 17 మంది మృతి

దుబాయ్‌: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. మరో తొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఒమనీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మసాలత్‌కు చెందిన బస్సు 31 మంది ప్రయాణికులతో గురువారం ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి దుబాయ్‌కు బయల్దేరింది. బస్సు సరిగ్గా రషిదీయా మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ్నుంచి బస్సుల కోసం నిర్దేశించిన రోడ్డు మార్గంలో కాకుండా ఇతర వాహనాల కోసం నిర్దేశించిన రోడ్డు లేన్‌లోకి వేగంగా దూసుకెళ్లి ఎత్తైన బారికేడ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

భారతీయుల మృతిపట్ల దుబాయ్‌లోని భారత కాన్సూల్‌ జనరల్‌ విపుల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రషీద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు భారతీయుల్ని డిశ్చార్జి చేసినట్లు కూడా కాన్సూల్‌ జనరల్‌ ప్రకటించింది.  

మరిన్ని వార్తలు