ఐదంతస్తుల్లో 12 లక్షల పుస్తకాలు

19 Nov, 2017 01:38 IST|Sakshi

పుస్తక పురుగులకు బుక్స్‌ ఇచ్చి వదిలేస్తే చాలు గంటలు గంటలు అలాగే చదువుకుంటూ ఉండిపోతారు. ఇక ఈ ఫొటోలో ఉండే గ్రంథాలయంలో కానీ వారిని విడిచిపెడితే ఇక ఇంటిముఖం చూడనే చూడరేమో! ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఆహ్లాదకరమైన గ్రంథాలయాన్ని చైనా ప్రారంభించింది. ఈ గ్రంథాలయాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదేమో! అతిపెద్దగా సర్పిలాకారంలో ఉన్న ఈ గ్రంథాలయ ఆడిటోరియం అక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్‌ పనితనంతో ఔరా అనిపించేలా నిర్మించారు. చైనా టియాంజిన్‌లోని బిన్‌హై కల్చరల్‌ జిల్లాలో ఈ గ్రంథాలయం ఉంది. దీన్ని టియాంజిన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్, డచ్‌ డిజైన్‌ కంపెనీ ఎంవీఆర్‌డీవీ  సంస్థలు నిర్మించాయి. 34 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు ఐదంతస్తుల్లో ఉన్న ఈ గ్రంథాలయంలో 12 లక్షల పుస్తకాలు కొలువై ఉన్నాయి. ఇంత పెద్ద గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేయడానికి అక్కడి అధికారులకు మూడేళ్ల సమయం పట్టింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌ను పుస్తకాలు చదవడానికి, మధ్య భాగం సేద తీరడానికి, చర్చించుకోవడానికి వినియోగిస్తున్నారు. కార్యాలయాలు, కంప్యూటర్, ఆడియో రూములను పైభాగంలో ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు