ఈ బుడ్డోడు సూపర్‌ ఫాస్ట్‌!

23 May, 2016 11:39 IST|Sakshi
ఈ బుడ్డోడు సూపర్‌ ఫాస్ట్‌!

సాక్రమెంటో: ఈ బుడ్డోడికి నిండా పన్నెండేళ్లు కూడా లేవు. కానీ ఇప్పటికే ముడు డిగ్రీలు పూర్తిచేసి పట్టా పుచ్చుకున్నాడు. మరో రెండు యూనివర్సిటీలు పిలిచి మరీ పీజీ సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. చిన్న వయస్సులోనే చదువులో పెద్ద ప్రతిభ చూపుతున్న ఆ చిన్నారే.. 12 ఏళ్ల తనిష్క్ అబ్రహం. అమెరికాలోని సాక్రమెంటోకు చెందిన ఈ చిన్నారికి యూసీ డేవిస్‌ యూనివర్సిటీ, యూసీ శాంటాక్రూజ్‌ వర్సిటీల్లో సీటు వచ్చింది. వీటిలో ఏ వర్సిటీలో చేరాలో అబ్రహం ఇంకా నిర్ణయించుకోలేదు. బయో మెడికల్ ఇంజినీరింగ్‌ చదవాలని భావిస్తున్న అబ్రహం తనకు 18 ఏళ్లు వచ్చేసరికి ఎండీ పూర్తి చేసి డాక్టర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

చదువులో సూపర్ ఫాస్ట్‌గా ఉన్న అబ్రహంకు 18 ఏళ్లు వచ్చేసరికి డాక్టర్‌గా, వైద్య పరిశోధకుడిగా పట్టాలు సాధించే అవకాశముంది. అబ్రహం గురించి తాజాగా సాక్రమెంటో టెలివిజన్ స్టేషన్‌ 'సీబీఎస్‌ 13' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అబ్రహం 7 ఏళ్ల వయస్సులోనే కమ్యూనిటీ కాలేజీలో చేరాడు. సాక్రమెంటోలోని అమెరికన్‌ రివర్ కాలేజీలో జరనల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజికల్ సైన్స్‌, విదేశీ భాష సబ్జెక్టులుగా కాలేజీ చదువు పూర్తి చేశాడు. తరగతి గదిలో జటిలమైన సబ్జెక్ట్‌ పాఠాలు అబ్రహంకు చెప్పడానికి తాము మొదట భయపడ్డామని, కానీ, అతడు పాఠాలు శ్రద్ధగా వింటూ, మధ్యమధ్యలో ప్రశ్నలు అడుగుతూ సందేహాలు నివృత్తి చేసుకునేవాడని వారు అంటున్నారు.

అబ్రహం తమను ప్రశ్నలు అడుగడంలో ఎప్పుడూ భయపడలేదని బయాలజీ ప్రొఫెసర్ మర్లెన్ మార్టినెజ్‌ చెప్పారు. తనిష్క్‌ తల్లి వెటినరీ డాక్టర్‌. ఆమె మొదట్లో కొన్నిరోజులపాటు కొడుకుతో కలిసి తరగతి గదులకు హాజరయ్యేది. నాలుగేళ్ల వయస్సులోనే ఐక్యూ సొసైటీలో చేరిన తనిష్క జ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకునేవాడని, వాడి స్పీడ్‌ను చూసి భవిష్యత్తులో పిచ్చి శాస్త్రవేత్త అవుతాడేమోనని ఒకానొక దశలో తాము భయపడ్డామని తండ్రి బిజౌ అబ్రహం చెప్పాడు.

మరిన్ని వార్తలు