స్పెయిన్‌లో ఉగ్ర దాడి

18 Aug, 2017 07:54 IST|Sakshi
స్పెయిన్‌లో ఉగ్ర దాడి

13 మంది మృతి.. 50 మందికి తీవ్ర గాయాలు
► పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాను
► అప్రమత్తమైన ఐరోపా దేశాలు
► బాధితుల్లో భారతీయులు లేరు: సుష్మాస్వరాజ్‌  


బార్సిలోనా: స్పెయిన్‌పై ఉగ్రదాడి జరిగింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బార్సిలోనాలోని లాస్‌ రాంబ్లాస్‌లో పర్యాటకులపైకి గురువారం సాయంత్రం వేగంగా వచ్చిన ఓ వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. పాదచారులను ఢీకొన్న తర్వాత దాదాపు అరకిలోమీటరు దూరం వరకు వ్యాన్‌ దూసుకెళ్లటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ప్రమాదంగా దీన్ని భావించినప్పటికీ.. కాసేపటికే ఇది ఉగ్రదాడని బార్సిలోనా పోలీసులు ధ్రువీకరించారు.

కనీసం ఇద్దరు సాయుధులు ఈ ఘటనలో పాల్గొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులను వ్యాన్‌తో ఢీకొట్టిన ఓ ఉగ్రవాది.. పారిపోయి పక్కనున్న బార్‌లో దాక్కున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఆకస్మిక ఘటనతో అక్కడి పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులుతీశారు. లాస్‌ రాంబ్లాస్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నసమయంలోనే వ్యాన్‌ బీభత్సం సృష్టించిందని ఆమిర్‌ అన్వర్‌ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఉగ్రదాడిపై వెంటనే స్పందించిన పోలీసులు ముందుగా క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

లాస్‌ రాంబ్లాస్‌తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధం విధించారు. బార్సిలోనాలో మెట్రోతో పాటు పలు రవాణా మార్గాలను నిలిపివేశారు. మరోవైపు, ఘటనాస్థలానికి సమీపంలోని ఓ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో కాల్పులు శబ్దం విన్నట్లు స్థానికులు తెలిపారు. బార్సిలోనా శివార్లలోనూ ఇలాంటి దాడికోసం ఉద్దేశించిన రెండో వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్పెయిన్‌ సహా యూరప్‌ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.

ఈ ఏడాది లండన్‌ బ్రిడ్జి వద్ద, ఏడాది క్రితం ఫ్రాన్స్‌లోని నీస్‌లోనూ ఇదే తరహాలో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించిన సంగతి తెలిసిదే. బార్సిలోనా ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో భారతీయులెవరూ లేరని ఆమె ట్వీట్‌ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో స్పెయిన్‌కు దౌత్యపరమైన సా యం అందించేందుకు సిద్ధమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ స్పష్టం చేశారు. అమెరికా మిత్రదేశాలపై ఉగ్రదాడులను సహించబోమని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు