అమెరికాలో 14% విదేశీయులే

18 Sep, 2018 01:46 IST|Sakshi

వారిలో అత్యధికులు భారతీయులే

ఏడేళ్లలో రెట్టింపయిన వలసదారులు

అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్‌ సర్కారు శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం మంది విదేశీయులే ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట.

ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారితోపాటు అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. 14 శాతం మంది వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌(సీఐఎస్‌) పేర్కొంది. ఒక్క 2016లోనే అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది. 2017 జూలై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది.

మనవాళ్లే ఎక్కువ
2010–17 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్‌ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%), డొమినికన్‌ రిపబ్లిక్‌ (2.83 లక్షలు–32%) ఉన్నాయి. ఈ కాలంలో నేపాల్‌ వలసదారులు 120% పెరిగారు. 2017 జూలై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు. పాకిస్తాన్‌ నుంచి 4 లక్షల మంది అమెరికాకు వలస వచ్చినట్లు సీఐఎస్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2010– 17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు. మరో 3 లక్షల మంది చనిపోతున్నారు.

మరిన్ని వార్తలు