కాబూల్‌లో భారీ బాంబు పేలుడు

8 Aug, 2019 04:33 IST|Sakshi

14 మంది మృతి, 145 మందికి గాయాలు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు దగ్గర్లోనే ఈ దాడి చోటుచేసుకుంది. ఈ దాడికి తమదే బాధ్యత అని తాలిబన్‌ ఉగ్రవాదులు ప్రకటించారు. కారు బాంబుతో దాడి జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, తాలిబన్‌ మాత్రం ట్రక్‌ బాంబ్‌తో ఈ పేలుడు జరిపినట్లు ప్రకటించారు. ఈ దాడిలో 14 మంది అక్కడిక్కడే మృతి చెందగా, 145 మంది గాయపడ్డారు. అమెరికా సైన్యాలు అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు, దోహాలో తాలిబన్లకు, యూఎస్‌ బలగాలకు మధ్య ఎనిమిదో దఫా చర్చలు జరుగుతుండగానే ఈ దాడి జరగడం గమనార్హం.  

స్థానిక కాలమానం ప్రకారం రద్దీగా ఉండే ఉదయం 9 గంటల సమయంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడు శబ్దం పశ్చిమ కాబూల్‌ అంతా మారు మోగింది. పేలుడు అనంతరం చాలా మంది మహిళలు తమ భర్తల కోసం, పిల్లల కోసం ఏడుస్తూ కనిపించారంటూ స్థానిక జర్నలిస్ట్‌ జకేరియా హసాని తెలిపారు. పేలుడు ధాటికి కిలోమీటరు పరిధిలోని దాదాపు 20 దుకాణాల గాజు కిటికీలు పగిలిపోయానని దుకాణదారుడు అహ్మద్‌ సాలేహ్‌ తెలిపారు. గాయపడిన 145 మందిలో దాదాపు 92 మంది సాధారణ పౌరులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడితో మరణించిన, గాయపడిన వారి సంఖ్య ఒక్క నెలలోనే దాదాపు 1500కు చేరింది. ఈ దాడికి ముందుగా కాబూల్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఇళ్లను అఫ్గాన్‌ బలగాలు ధ్వంసం చేశాయి.

మరిన్ని వార్తలు