ట్రంప్‌పై దావా వేసిన 16 రాష్ట్రాలు

19 Feb, 2019 10:46 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. తాజాగా ట్రంప్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 16 రాష్ట్రాలు కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్‌ తీసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని కోర్టులో దావా వేశాయి. ట్రంప్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డాయి. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని.. నిధుల కేటాయింపుల విషయంలో కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నాయి. 

కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ జేవియర్ బీసెర్రా, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనను తీసుకోచ్చారు. సైనికుల కోసం, విపత్తుల కోసం, ఇతర అవసరాల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లీస్తే భవిష్యత్తులో ముప్పు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేసిన దేశాల్లో.. కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, వర్జీనియాలు ఉన్నాయి. 

అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్‌ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. యూఎస్‌లో మరో షట్‌డౌన్‌ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరసటి రోజే ట్రంప్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు