యెమెన్‌లో ఐసిస్‌ నరమేధం

19 Dec, 2016 00:51 IST|Sakshi
యెమెన్‌లో ఐసిస్‌ నరమేధం

ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి ∙84 మందికి గాయాలు..

అడెన్‌: యెమెన్‌లోని అడెన్‌ ప్రాంతంతో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతిచెందారు. 84 మందికిపైగా గాయపడ్డారు. అడెన్‌లో సైనికులపై వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. వేతనాలు తీసుకునేందుకు ఈశాన్య అడెన్‌లోని సైనిక స్థావరం వద్ద గుమికూడిన సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సైనికుల్లో కలసిపోయి  ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు.

48 మంది సైనికులు మరణించారని, 84 మంది ఇతరులు గాయపడ్డారని అడెన్‌ హెల్త్‌ చీఫ్‌ అబ్దుల్‌ నాసర్‌ అల్‌–వలి తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. తెగిపడిన శరీర భాగాలు, నెత్తుటి చారికలతో ఆ ప్రాంతం భీతి గొలుపుతోంది. కాగా, దాడి తమ పనేనని ఐఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు ఎనిమిది రోజుల క్రితం అల్‌–సవ్లాబన్‌ ప్రాంతంలో ఇదే తరహాలో ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 29 మంది ఇతరులు గాయపడ్డారు.

బాగ్దాదీని పట్టిస్తే 170 కోట్లు
వాషింగ్టన్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీపై ఉన్న బహుమానాన్ని అమెరికా భారీగా పెంచింది. బాగ్దాదీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసిన వారికి 25 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (సుమారు 170 కోట్లు) ఇస్తామని తెలిపింది. బాగ్దాదీని పట్టించిన లేదా సమాచారం తెలిపిన వారికి తొలుత 10 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల (సుమారు 68 కోట్లు)ను బహూకరిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.  దీన్నే రెండింతలు పైగా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 2011లో అల్‌కాయిదా అధినేత ఒసామా బిన్‌లాడెన్‌పై కూడా అమెరికా 25 మిలియన్‌ యూఎస్‌ డాలర్లను ప్రకటించింది. ఆ తర్వాత ఇంత మొత్తంలో బహుమతిని మరొకరిపై అమెరికా ఎన్నడూ ప్రకటించలేదు. 

>
మరిన్ని వార్తలు