పొగాకు కంపెనీ నిధులతోనే ధూమపానంపై.......

18 Mar, 2018 02:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ శతాబ్దంలో ధూమపానంతో సంక్రమించే జబ్బుల కారణంగా మరణించే వంద కోట్ల మంది ప్రాణాలను రక్షించడం ఎలా ? అన్న అంశంపై దక్షిణాఫ్రికాలో గతవారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్యులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు అనర్గళంగా మాట్లాడారు. ‘యునైటింగ్‌ ది వరల్డ్‌ ఫర్‌ టొబాకో ఫ్రీ జనరేషన్‌ (పొగాకురహిత తరం కోసం ప్రపంచాన్ని ఏకం చేద్దాం)’ అన్న థీమ్‌పైనా ముందుగా ఈ చర్చ సజావుగానే జరిగింది. ఈ థీమ్‌ను ఖరారు చేసిందీ లాభాపేక్షలేని స్వతంత్ర, స్వచ్ఛంద సంస్థగా చెప్పుకునే ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఏ స్మోక్‌ ఫ్రీ వరల్డ్‌’. ఈ అంతర్జాతీయ సంస్థకు సంధానకర్తగా వ్యవహరించిందీ కూడా ఈ సంస్థనే. 

అంతేకాదు, ధూమపానాన్ని నియంత్రించేందుకు ‘ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ టొబాకో కంట్రోల్‌ లేదా ఎఫ్‌సీటీసీ) పేరిట ఓ అంతర్జాతీయ ఒప్పందం కుదరడానికి కూడా గతేడాదే అమల్లోకి వచ్చిన ఈ స్మోక్‌ ఫ్రీ వరల్డ్‌ ఫౌండేషన్‌ అధిపతి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ అధికారి డెరెక్‌ యాచ్‌ చేసిన కషే కారణం. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం వెలుగులోకి రావడంతో అప్పటి వరకు సజావుగా జరిగిన చర్చ మరో దిశకు మారి ధూమపానంలా వక్తలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సంస్థకు ఏడాదికి 8 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని విరాళంగా ఇస్తున్నది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద టొబాకో కంపెనీ అయిన ‘ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌ (పీఎంఐ)’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘మార్ల్‌బోరో’ బ్రాండ్‌ ఈ కంపెనీదే. ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులు అమ్ముకుంటూ అధిక లాభాలు గడిస్తున్న ఈ సంస్థ తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం శాస్త్ర విజ్ఞాన, వైద్య అంశాలను వక్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్మోక్‌ ఫ్రీ వరల్డ్‌ ఫౌండేషన్‌ అధికారి డెరెక్‌ యాచ్‌ రాసిన కొన్ని వ్యాసాలు కూడా అలాంటివేనన్న విమర్శలు ఉన్నాయి. 

‘ఓ పొగాకు కంపెనీ నుంచి భారీ ఎత్తున విరాళాలు తీసుకుంటూ పొగాకు రహిత సమాజం కోసం ఎలా కషి చేయగలం? అందులో చిత్తశుద్ధి ఉంటుందా? నైతికత ఉంటుందా? ఆత్మవంచన కాదా? అభాసుపాలు కామా ? అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా అర్థం చేసుకుంటుందీ? అన్న ప్రశ్నలు సదస్సులో కొందర విమర్శకులు లేవనెత్తడంతో ముందుగా ఉక్కురిబిక్కిరైన వక్తలు ఆ తర్వాత తమలో తాము వాదించుకున్నారు. పొగాకు కంపెనీలకు పొగాకు, ధూమపానం నియంత్రణా సంస్థలు, విధానకర్తలు దూరంగా ఉండాటంటూ కొందరు వక్తలు ‘బ్రేకింగ్‌ బిగ్‌ టొబాకోస్‌ గ్రిప్‌’ అన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘స్మోక్‌ ఫ్రీ వరల్డ్‌’ ఫౌండేషన్‌కు దూరంగా ఉండాలని కూడా అభిప్రాయపడ్డారు.

‘ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌’ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ‘డిజైనింగ్‌ స్మోక్‌ ఫ్రీ ఫ్యూచర్‌’ అని చెప్పుకుంటోంది. అంతేకాదు, సిగరెట్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన తమ కంపెనీ ‘మానేయడానికి’ ప్రయత్నిస్తోందంటూ ఈ ఏడాది వాణిజ్య ప్రకటనలను కూడా విడుదల చేసింది. ఇక్కడ ‘డిజైనింగ్‌ స్మోక్‌ ఫ్రీ ఫ్యూచర్‌’ అంటే పొగ రహిత భవిష్యత్తు కోసం అని అర్థం. సిగరెట్ల ఉత్పత్తిని మానేసేందుకు ప్రయత్నిస్తున్నామంటే వాటి స్థానంలో తక్కువ హానికరమైన మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నామని అర్థం. ‘ఇక్కడ స్మోక్‌ ఫ్రీ, టొబాకో ఫ్రీ’ అనే పదాలకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిలిప్‌ మోరిస్‌ కంపెనీ ‘స్మోక్‌ ఫ్రీ’ అని చెబుతుందిగానీ ‘టొబాకో ఫ్రీ’ అని చెప్పడం లేదు. పొగరాని ఉత్పత్తులను తీసుకొస్తాంగానీ పొగాకులేని ఉత్పత్తులు తీసుకరామని కంపెనీ ఉద్దేశంగా కనిపిస్తోంది. 

ధూమపానం నియంత్రణ కోసం కషి చేస్తున్న ‘స్మోక్‌ ఫ్రీ వరల్డ్‌’కు తాము చిత్తశుద్ధితోనే విరాళాలు ఇస్తున్నామని అంతర్జాతీయ సదస్సలో గొడవ జరగడంతో ఫిలిప్‌ మోరిస్‌ కంపెనీ సమర్థించుకుంది. హానికరమైన ఉత్పత్తులపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించేందుకు, అవసరమైన విధాన నిర్ణయాలు వెలువడేందుకు, తక్కువ హానికరమైన ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఈ చర్చలు దోహద పడతాయని ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌ సీఈవో ఆండ్రీ కలాంట్జోపౌలస్‌ చెప్పారు. ఇలాంటి చర్చల ఫలితంగానే తాము తక్కువ హానికరమైన, తక్కువ వేడినిచ్చే సన్నటి సెగరెట్లను ‘ఐక్యూఓఎస్‌’ బ్రాండ్‌ పేరిట విడుదల చేశామని చెప్పారు. ఇప్పటికీ తమదీ ‘స్మోక్‌ ఫ్రీ ఫ్యూచర్‌’ అన్నదే నినాదమని ఆయన సమర్థించుకున్నారు. ‘స్వేచ్ఛగా ధూమపానం చేయండి’ అన్నది ఆయన మాటల్లోని అంతర్లీనార్థమేమో!.

మరిన్ని వార్తలు