సూడాన్‌లో భారీ అగ్నిప్రమాదం

5 Dec, 2019 01:01 IST|Sakshi
పరిశ్రమ వద్ద మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

18 మంది భారతీయులు మృతి

ఖార్టూమ్‌: ఎల్పీజీ ట్యాంకర్‌ పేలడంతో పరిశ్రమ నిండా మంటలు కమ్ముకొని 18 మంది భారతీయులను బతికుండగానే కాల్చేశాయి. సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్‌ పరిశ్రమలో మంగళవారం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్‌లోని భారత ఎంబసీ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు బుధవారం సమాచారం అందించారు.

ఈ విషయం తెలిసిన విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదం బారిన పడిన భారతీయుల వివరాలను వెల్లడించారు. అందులో 7 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిపాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మొత్తం 34 మంది భారతీయులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వెల్లడించింది. ఆ దేశంలోని భారత ఎంబసీ 24 గంటల హెల్ప్‌లైన్‌ +249–921917471ను ఏర్పాటు చేసింది.  సిరామిక్‌ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన చోట భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉండడంతో ప్రమాద స్థాయి పెరిగింది. దీంతో పరిశ్రమ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది.
 

మరిన్ని వార్తలు