సర్జరీ చేసిన 18 సంవత్సరాల తర్వాత!

4 Jan, 2017 15:54 IST|Sakshi
సర్జరీ చేసిన 18 సంవత్సరాల తర్వాత!

హనోయ్: తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. ఆల్ట్రా సౌండ్ స్కాన్లో తన పొట్టలో 15 సెంటీమీటర్ల పొడవైన కత్తెర ఉందని తేలడంతో కళ్లు తేలేశాడు. అయితే.. అది తన పొట్టలోకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే.. అది ఈనాటిది కాదు.. 18 సంవత్సరాల క్రితంది అని గుర్తుచేసుకున్నాడు.

1998లో జరిగిన కారు ప్రమాదంలో వియత్నాంకు చెందిన మా వాన్ నాట్(54) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి అతడి ప్రాణాలు కాపాడారు. అయితే.. ఆపరేషన్ నిర్వహించే సమయంలో అతడి పొట్టలో ఓ భారీ కత్తెరను వదిలేసి ముగించారు. ఆ సర్జరీ విషయమే మరచిపోయి హాయిగా ఉంటున్న వాన్ నాట్ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హనోయ్ సమీపంలోని ఓ ఆసుపత్రి వైద్యులు సుమారు 3 గంటల పాటు శ్రమించి అతడి పొట్టలో ఉన్న కత్తెరను తొలగించారు. గతంలో సర్జరీ చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇన్నేళ్లు గడవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు