న్యూయార్క్ పేలుళ్లలో ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు

12 Mar, 2014 22:44 IST|Sakshi
న్యూయార్క్ పేలుళ్లలో ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో బుధవారం ఉదయం మన్ హట్టన్ లోని ఈస్ట్ హార్లెమ్ లో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 18 మందికి గాయలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద ఉన్న బాధితులను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.
 
గాయపడిన వారిని హార్లెమ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. విద్యుత్ నిలిపివేసేందుకు,  గ్యాస్ లైన్లను మూసి వేసేందుకు సంబంధిత సిబ్బంది పనిలో నిమగ్నమయ్యారు.
 
బుధవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. చాలా మంది తీవ్ర ఆందోళనకు గురికాగా, మరికొందరు దిగ్ర్బాంతికి గురయ్యారు. ఈ ఘటనకు కారణమేమి తెలియరాలేదు. అయితే గ్యాస్ లీక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు