ఆ గుండె రెండుసార్లు పగిలింది!

29 Jan, 2016 09:11 IST|Sakshi
ఆ గుండె రెండుసార్లు పగిలింది!

అవయవదానం మరో మనిషికి ఆయుష్షు పోస్తుంది. అలా అమర్చిన అవయవాల్లో  పాత వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు ఉంటాయా? దాత అలవాట్లు స్వీకర్తకు వస్తాయా? అసలు  ‘సెల్యులార్ మెమొరీ’ అనేది ఉంటుందా? ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే, ఈ తరహా ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న దాత గుండె స్వీకరించిన వ్యక్తి కూడా అదే విధంగా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా  ‘సెల్యులార్ మెమొరీ’పై చర్చకు దారి తీసింది.
 
2008, ఏప్రిల్ 1.. సోనీ గ్రాహమ్ (69) అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఇలాంటివి సహజమే. కానీ, ఇది మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఎందుకంటే గ్రాహమ్ సాధారణ వ్యక్తే అయినా అతని గుండె ఆయనది కాదు. 13 ఏళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్న టెర్రీ కాటల్ (33) అనే యువకుడిది. విచిత్రమేంటంటే.. టెర్రీకాటల్ భార్య ‘చెరిల్ స్వీట్’ను సోనీగ్రాహమ్ వివాహమాడాడు. అంతకంటే విచిత్రంగా టెర్రీకాటల్ తరహాలోనే తలను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒకే గుండె రెండుసార్లు చెరిల్‌తో జీవితం పంచుకుంది. మొదటిసారి ఆమెను వదిలివెళ్లిన హృదయం అనుకోకుండా తిరిగి దగ్గరైంది. అంతే విచిత్రంగా మరోసారి ఆమెను విడిచి శాశ్వతంగా దూరమైంది.

 ఏం జరిగింది?
దక్షిణ కరోలినాకు చెందిన టెర్రీ కాటల్- చెరిల్ స్వీట్ దంపతులు. కొన్నేళ్ల కాపురం తర్వాత జీవితం మీద విరక్తి కలిగి తుపాకీతో కాల్చుకుని కాటల్ 1995లో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో గుండె వ్యాధితో దాదాపు చావుకు దగ్గరైన సోనీ గ్రాహమ్ (57)కు ఓ గుండె అందుబాటులో ఉందని తెలిసింది. వెంటనే వైద్యులు కాటల్ గుండెను శస్త్రచికిత్స ద్వారా వేరు చేసి గ్రాహమ్‌కు అమర్చారు. అతనికి పునర్జన్మ ఇచ్చారు. ఆ తర్వాత తనకు గుండె దానం చేసిన కుటుంబ వివరాలను ఎలాగోలా సంపాదించాడు గ్రాహమ్.

 

దాదాపు ఏడాది తరువాత చెరిల్‌ను కలుసుకున్నాడు. తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆమెను కలసిన తరువాత గ్రాహమ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చెరిల్‌ను ఇష్టపడటం మొదలు పెట్టాడు. 2004లో గ్రాహమ్ తన కూతురు వయసున్న చెరిల్‌ను వివాహమాడాడు. దీంతో ఒకే గుండెను ఆమె రెండుసార్లు వివాహమాడింది. అయితే, నాలుగేళ్ల తర్వాత 2008లో గ్రాహమ్ కూడా కాటల్ బాటలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య  చేసుకున్నాడు.

 కారణాలు ఏంటి?
కాటల్ గుండె అమర్చుకున్న గ్రాహమ్ కూడా అతనిలానే తుపాకీతో కాల్చుకుని చనిపోవడంతో సెల్యులార్ మెమొరీపై చర్చ మొదలైంది. ఆపరేషన్ తరువాత గ్రాహమ్‌లో ప్రవర్తనలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. మునుపెన్నడూ లేనంతగా బీర్, హాట్‌డాగ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టాడు. అవన్నీ కాటల్‌కు ఇష్టమైనవే! చెరిల్‌ను చూస్తుంటే కొత్తవారిని చూసినట్లు అనిపించలేదని తన సన్నిహితులతో గ్రాహమ్ చెప్పేవాడు. ఆమె తనకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నదానిలానే అనిపిస్తోందని అనేవాడు.

 

ఇదే విషయాన్ని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ చెప్పాడు. ఆమెకు దగ్గర కావడానికే చాలా ప్రయత్నించాడు. దగ్గరైన తరువాత చెరిల్ పాత భర్త టెర్రీకాటల్ తరహాలోనే తుపాకీతోనే కాల్చుకుని జీవితానికి ముగింపు పలికాడు. ఈ కారణాలన్నీ సెల్యులార్ మెమొరీ ఉంటుందని నమ్మేవారికి ఆధారాలుగా మారాయి. అవయవదానం జరిగిన దాదాపు 70 కేసుల్లో గ్రహీతలకు దాతల తాలూకు అలవాట్లు వస్తున్నాయని వారు వాదిస్తున్నారు. మరోవైపు ఇవన్నీ కాకతాళీయంగా జరిగినవేనని కొట్టిపారేసే వైద్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు