అంతరిక్షానికి.. 20 ‘మౌస్ట్రోనాట్లు’!

24 Sep, 2014 02:15 IST|Sakshi
అంతరిక్షానికి.. 20 ‘మౌస్ట్రోనాట్లు’!

రోదసికి వెళ్లే మనుషులను ఆస్ట్రోనాట్లు(వ్యోమగాములు) అంటాం గదా.. అలాగే.. అంతరిక్షానికి వెళ్లిన ఎలుకలే ఈ మౌస్ట్రోనాట్లు! అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఆదివారం నింగికి బయలుదేరిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో బయలుదేరిన 20 ఎలుకలు మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయి. ఫాల్కన్ రాకెట్ ద్వారా రోదసికి చేరిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఐఎస్‌ఎస్‌కు చెందిన రోబోటిక్ చేయి ద్వారా వ్యోమగాములు అనుసంధానం చేసుకున్నారు. నాసాతో నాలుగో కాంట్రాక్టులో భాగంగా స్పేస్‌ఎక్స్ కంపెనీ పంపిన ఈ రాకెట్‌లో 20 ఎలుకలతో పాటు వ్యోమగాములకు అవసరమైన ఫ్రీజ్-డ్రైడ్ మీల్స్, 3డీ ప్రింటర్, ఇతర పరికరాలు మొత్తం 2,200 కిలోల బరువైన సరుకుల్ని పంపారు.

అయితే.. మనిషి కాకుండా ఇతర క్షీరదాలను ఐఎస్‌ఎస్‌కు పంపడం ఇదే తొలిసారి. రోదసిలో గురుత్వాకర్షణ లేమిలో కండరాల క్షీణతపై ప్రయోగాలు జరిపేందుకు గాను ఈ ఎలుకలను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపింది. కండరాలు క్షీణించేందుకు కారణమయ్యే ‘మజిల్ రింగ్ ఫింగర్-1’ జన్యువును తొలగించిన ఈ ఎలుకలు ఐఎస్‌ఎస్‌లో నెలపాటు ఉంటాయి. వీటిపై రోదసిలో ప్రయోగాల ద్వారా.. భూమిపై మనుషుల్లో కండర క్షీణత సమస్యకు పరిష్కారం, మందులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు