నడపక్కర్లేదు.. ఆదేశిస్తే చాలు

22 Apr, 2014 04:08 IST|Sakshi
నడపక్కర్లేదు.. ఆదేశిస్తే చాలు

ఈ వాహనం డిజైన్ చూశారా? ఎంత వెరైటీగా ఉందో.. దీని రూపకర్త టొయోటా. చైనాలోని బీజింగ్‌తోపాటు న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఆటోషోలో ప్రదర్శిస్తున్న ఈ ఎఫ్‌వీ2(ఫన్ వెహికల్) వాహనం డిజైన్‌ను చూసినవారంతా ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని వాహనంలా కనిపిస్తోందని అంటున్నారు. దీని పూర్తి వివరాలను టొయోటా కంపెనీ వెల్లడించనప్పటికీ.. నిపుణులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇది డ్రైవర్ రహిత వాహనం. ఒక్కరు మాత్రమే కూర్చునే అవకాశముంది. ముందొకటి.. మధ్యలో రెండు, చివ ర ఒక చక్రం కలిపి మొత్తం నాలుగు చక్రాలుంటాయి. ఏ ఇంజిన్ అన్న వివరాలు తెలియనప్పటికీ.. ఎలక్ట్రిక్ ఇంజిన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌వీ2 వాహనం ముందు ఉండే తెరపై మనకు ట్రాఫిక్‌కు సంబంధించిన సూచనలు వంటివి వస్తాయి. అంతేకాదు.. మన మూడ్ బట్టి తెర రంగు మారుతుంది.
 
 మీరు ఆగ్రహంగా ఉంటే.. ఎరుపు రంగులోకి తెర మారిపోతుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు పచ్చ రంగులోకి వస్తుంది. దిగులుగా ఉంటే.. మీకు నచ్చే ప్రదేశాల్లో ఒకదాన్ని సూచిస్తూ.. అక్కడికి వెళ్లమంటూ ఓ సందేశం తెరపై ప్రదర్శితమవుతుంది. ఇది డ్రైవర్ రహిత వాహనమైనప్పటికీ.. మనం నడపాలంటే.. దీన్ని నడపొచ్చు. డ్రైవర్ మోడ్‌లోకి మారిస్తే.. మన శరీర కదలికలు ఆధారంగా దీన్ని నియంత్రించవచ్చట. అంటే.. వాహనం ఎడమ వైపునకు తిరగాలంటే, మనం ఎడమ వైపునకు వంగితే అలా తిరుగుతుందన్నమాట. ఏ సైడు మన శరీరాన్ని వంచితే.. అటు వైపు వెళ్తుంది. భవిష్యత్తు వాహనంగా పేర్కొంటున్న ఎఫ్‌వీ2.. ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్న వివరాలను టొయోటా కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, అంతవరకూ ఉత్సాహవంతుల కోసం టొయోటా ఎఫ్‌వీ2 పేరిట ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. దీని ద్వారా మనం ఆ వాహనాన్ని నడిపిన అనుభూతిని పొందొచ్చట.

మరిన్ని వార్తలు