'నేను తిరిగి రాకుంటే మా డాడీ మీడాడీ అనుకో'

14 Aug, 2015 19:24 IST|Sakshi
'నేను తిరిగి రాకుంటే మా డాడీ మీడాడీ అనుకో'

తియాంజిన్: భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు ఆ అగ్నిమాపక సిబ్బందిని భస్మం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ముప్పై మందికి పైగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇది చైనాలో చోటుచేసుకున్న ఘటన. తియాంజిన్ పట్టణంలో రసాయన పదార్థాల పేలుళ్లు సంభవించి భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు వేశారా ఆ ప్రాంతంలో అన్నంత పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో వాటిని నిలువరించేందుకు చైనా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. కానీ వారిలో కొందరు దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

వారు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 21 మంది సిబ్బంది అగ్నికీలలకు ఆహుతి అయ్యారని చెప్తున్నా 36 మంది కనిపించడం లేదని వారంతా అందులోనే చిక్కుకుపోయారని మరికొందరు చెప్తున్నారు. ఇంతపెద్దమొత్తంలో అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం చైనాలో 1949 తర్వాత ఇదే తొలిసారి. మంటల్లో చిక్కుకున్న కొందరు అగ్నిమాపక సిబ్బందిలో కొందరు 'నేను ప్రాణాలతో తిరిగి రాకుంటే మా డాడీ ఇక మీ డాడీ అనుకో..  నాకుటుంబం నీ కుటుంబం అనుకో.. నా స్నేహం మరో జన్మకు కూడా నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెస్సేజ్లు పంపిచారు.

మరిన్ని వార్తలు