శామ్‌సంగ్ ఫ్యాక్టరీలో రూ.215 కోట్ల దోపిడీ!

9 Jul, 2014 07:23 IST|Sakshi
శామ్‌సంగ్ ఫ్యాక్టరీలో రూ.215 కోట్ల దోపిడీ!

బ్రెజిల్‌లో 40 వేల ఫోన్లు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు
 
శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శామ్‌సంగ్ ఫ్యాక్టరీలోకి చొరబడిన 20 మంది సాయుధ దొంగలు ఏకంగా రూ. 215 కోట్ల విలువైన 40వేల సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని పరారయ్యారు. తొలుత నైట్‌షిఫ్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి దగ్గరలో హైజాక్ చేసిన దొంగలు.. బస్సులోని 8 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్‌ఫోన్లు తీసుకున్నారు. ఏమీజరగనట్లే ఉండాలని బెదిరించారు.

దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లడం చూస్తుంటే.. ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి పరికరాల మొత్తం విలువను నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు