30 వేల అడుగుల ఎత్తులో ప్రత్యక్ష నరకం

19 Apr, 2018 11:20 IST|Sakshi
ఫ్లైట్‌ 1380 ఇంజన్‌ పేలిపోగా భయంతో ప్రార్థనలు చేస్తున్న ప్రయాణికులు

న్యూయార్క్‌ : అది సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం. ఫ్లైట్‌ నంబర్‌ 1380. మంగళవారం ఉదయం 11 గంటలకు 144 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సహాయక సిబ్బందితో న్యూయార్క్‌ నుంచి డల్లాస్‌కు బయల్దేరింది. కానీ అంతలోనే పేలుడు శబ్దం వినపడటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంజన్‌ పేలిపోయిందని తెలుసుకున్న ప్రయాణికులు.. అప్పటివరకు పిల్లల కేరింతలను ఆస్వాదిస్తూ కాలక్షేపం కోసం సుడోకు ఆడుతూ, పాటలు వింటూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న వారంతా భయంతో హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. విమానం ఫ్యాన్‌  బ్లేడ్‌ చెడిపోవడంతో పదునైన రెక్క దూసుకురావడంతో కిటికీ పాక్షికంగా చెదిరిపోయింది. కిటికీ పక్కనే ఉన్న రియోర్డాన్‌ అనే ప్రయాణికురాలు ఒక్కసారిగా జారి కిందపడబోయింది. భూమి నుంచి 30 వేల అడుగుల ఎత్తులో.. ఊహించని ఈ పరిణామాలతో ప్రయాణికులు తమకు ఇక మరణం తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఇవే తమ ఆఖరి క్షణాలు అంటూ భోరున విలపించారు.

దేవుడా నువ్వే దిక్కు..
7 ఏళ్ల వయస్సులో తండ్రిని కోల్పోయిన షేరీ పియర్స్‌ అనే ప్రయాణికురాలు తన 11 ఏళ్ల కూతురుకి కూడా అదే కష్టం వస్తుందేమో అని బాధపడుతూ.. ‘ఈ బాధ, యాతన భరించలేను. దేవుడా త్వరగా తీసుకెళ్లు’ అంటూ ప్రార్థించడంతో తోటి ప్రయాణికులు కూడా కన్నీటి పర్యంతమాయ్యారు. విమానంలో ఉన్న ఓ జంట  ‘ముగ్గురు పిల్లల్ని చూడకూడకుండానే చనిపోతున్నాం. దేవుడా నువ్వే వారికి దిక్కు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘జీసస్‌ నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి’ అంటూ ప్రయాణికులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. 20 నిమిషాల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించిన తర్వాత పైలట్‌ చాకచక్యం వల్ల ఫిలడెల్ఫియాలో విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ కిటికీ నుంచి జారిపడి పోయిన రియెర్డాన్‌ను లోపలికి లాగినప్పటికీ తీవ్రగాయాల పాలైన ఆమె.. కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు గాయపడ్డారు.

ఆమె ధైర్యం వల్లే..
అమెరికన్‌ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట‍్లలో టామ్‌ జో షల్ట్స్‌ ఒకరు. సూపర్‌సోనిక్‌ ఎఫ్‌జె-18 హార్నెట్స్‌ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్‌ పేలిపోయినా ఆమె ధైర్యం చెక్కు చెదరలేదు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడటమే ఆమె ముందున్న లక్ష్యం. అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం ఫిలడెల్ఫియా అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన సహాయం అందించారు. క్షేమంగా ల్యాండ్‌ అవడానికి అప్పటికీ ఆమెకున్న అవకాశాలు తక్కువే. అయినప్పటికీ ధైర్యం చేసింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంది.

అయితే అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జరిగిన విమాన ప్రమాదాల్లో 2009 తర్వాత ఇదే మొదటి మరణం అని అధికారులు తెలిపారు. మంగళవారం జరిగిన ఫ్లైట్‌-1380 విమాన ప్రమాదం వల్ల అప్రమత్తమయ్యామని వారు పేర్కొన్నారు.  ఇంజన్‌లోని బ్లేడ్‌ పాతబడటం వల్లే పేలుడు సంభవించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు