నేపాల్‌లో భారీ వ‌ర్షాలు.. 22 మంది మృతి

11 Jul, 2020 11:05 IST|Sakshi

ఖాట్మండు : నేపాల్‌లో గ‌త 48 గంట‌లుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డి చ‌నిపోయిన వారిసంఖ్య 22కు చేరుకుంది. ముఖ్యంగా క‌స్కి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మరణించిన‌ట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున భారీ వ‌ర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి చెంద‌గా మరో 10 మంది గాయపడటంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. 12 మంది మృతి)

గురువారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. లాంజంగ్ జిల్లా బెసిషాహర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌ర‌ణించారు. మయాగ్డి జిల్లాలో  కొండచరియలు విరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా జజార్కోట్ జిల్లాలో ఏడుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. చాలామంది వాటికింద చిక్కుకుపోయిన‌ట్లు గుర్తించిన అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అన్ని ప్రాంతాల్లో క‌లిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. ఆగకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా నారాయణి స‌హా ఇత‌ర ప్ర‌ధాన న‌దులు పొంగి పొర్లుతున్నాయి. మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావరణ శాఖ వెల్లడించింది.


 

మరిన్ని వార్తలు