శవాల గుట్టలు.. 227 మంది చిన్నారుల ప్రాణత్యాగం..!

28 Aug, 2019 12:01 IST|Sakshi

లిమా : పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో శవాల గుట్టలు బయటపడ్డాయి. రాజధాని లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనగొన్నామని ఆర్కియాలజిస్టు ఫెరెన్‌ కాస్టిలో చెప్పారు. హువాన్‌చాకోలో కొనసాగుతున్న పురావస్తుశాఖ తవ్వకాలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేవుడికి తమను తాము అర్పించుకుని వారంతా సామూహికంగా ప్రాణాలు విడిచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం బాధాకరమన్నారు. అవశేషాలన్నీ క్రీస్తు 1200-1400 కాలానికి చెందిన చిమూ సంస్కృతికి చెందిన మనుషులవేనని తెలిపారు.

తొలుత గతేడాది రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్‌ వద్ద తవ్వకాల్లో 56 పుర్రెలు బయటపడ్డాయని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న హువాన్‌చాకోలో తవ్వకాలు జరపగా 190 చిన్నారుల శరీర అవశేషాలు, 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన చోటల్లా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన బొక్కల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడటం కలచి వేసిందని చెప్పారు. మొత్తంగా ఇప్పటివరకు 227 మానవ అస్థిపంజరాలు వెలికి తీశామని, తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. శవాలన్నీ సముద్రం వైపునకు ముఖం చేసి ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున ప్రాణత్యాగం చేసిన ఉదంతాలు బయటపడటం చరిత్రలో తొలిసారని అన్నారు. కొలంబియన్‌ సృంస్కృతికి ముందుదైన చిమూ సంస్కృతి పెరూవియన్‌ తీరం వెంబడి ఈక్వెడార్‌ వరకు విస్తరించింది. ఐంక రాజ్యస్థాపనతో 1475లో అంతరిచింది. 

మరిన్ని వార్తలు