గోదాంలో పేలుళ్లు: 24 మంది మృతి

6 Jul, 2018 17:30 IST|Sakshi
పేలుళ్లు సంభవించిన ప్రదేశం

మెక్సికో : ఓ బాణసంచా కేంద్రంలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లతో సుమారు 24 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన గురువారం మెక్సికో పట్టణంలోని టుల్‌పెక్‌లో చోటు చేసుకుంది. వరుస పేలుళ్లు సంభవించడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. మొదటి పేలుడుతోనే సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర విభాగాలు ఘటనా స్థలికి చేరి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో మరోసారి పేలుడు సంభవించడంతో సహాయ చర్యల్లో పాల్గొన్న పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై మెక్సికో ప్రభుత్వ అధికారి స్పందిస్తూ.. మొదటి ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టామని, 20 నిమిషాల అనంతరం మరోసారి వరుసగా పేలుళ్లు సంభవించాయన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ఫైర్ సిబ్బందితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు, ఒక సివిల్ డిఫెన్స్ అధికారి మృతి చెందారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మృతులు సంఖ్య 24గా గుర్తించామని, సుమారు 49 మంది వరకు గాయపడి ఉంటారని వెల్లడించారు. బాధితుల్లో 7ఏళ్ల వయసుగల చిన్నారి ఉన్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ‌టంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాప‌క సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనతో చుట్టుప‌క్క‌ల నివాసం ఉంటున్న‌వారంతా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ పేలుడు శబ్ధానికి భారీ ఎత్తు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. ఆస్తి న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 

ఈ ఘటన చోటుచేసుకున్న పట్టణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. బాణాసంచా తయారీలో ఈ ప్రాంతానికి 200ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతిఏడాది ఆ దేశంలో జరిగే ఫైర్‌వర్క్స్ ఫెస్టివల్ ఇక్కడే జరుగుతోంది. మెక్సికో సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం పైరోటెక్నిక్ క్యాపిటల్‌గా పేరుగాంచింది. 

మరిన్ని వార్తలు