కరోనా: ‘ఆ డ్రగ్‌ తనకు పనిచేయలేదు’

9 Apr, 2020 12:05 IST|Sakshi
మృతురాలు లిలానీ(ఫైల్‌ఫొటో: సీఎన్‌ఎన్‌)

వాషింగ్టన్‌: ‘‘నా కూతురిని చివరిసారిగా చేతుల్లోకి తీసుకున్నా. నా బేబీ అందరికీ సహాయం చేసేది. తను ఈ లోకాన్ని వదిలివెళ్లడంతో నా హృదయానికి చిల్లుపడినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ జెనోబియా షీఫర్డ్‌ అనే మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా వైరస్‌ కంటికి కనిపించదని.. అది ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మేరీల్యాండ్‌లోని ఓ గ్రోసరీ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న లిలానీ ఇటీవల మృతి చెందారు. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) బారిన పడిన ఆమె మస్తిష్క పక్షవాతంతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో తన కూతురు 27 ఏళ్ల వయస్సులోనే మరణించడానికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో లేకపోవడమే కారణమని జెనోబియా ఆరోపించారు. తన కూతురు వృద్ధులకు సహాయం చేసేదని... సరుకులు కార్ల వద్దకు చేర్చేదని గుర్తుచేసుకున్నారు. (భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్‌)

ఈ క్రమంలో కోవిడ్‌-19 సోకగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అక్కడ తనకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇచ్చారని.. అయినప్పటికీ తను మరణించిందన్నారు. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో గ్రోసరీ స్టోర్లు మరింత పరిశుభ్ర వాతావరణంలో పనిచేసే వెసలుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. తన కూతురు నిస్వార్థంగా అందరికీ సేవ చేసేదని.. బటర్‌ఫ్లైని(లిలానీ ముద్దుపేరు) మిస్సవుతున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఆమె సవతి తండ్రి మాట్లాడుతూ.. లిలానీ చనిపోయే ముందు అందరికీ గుడ్‌బై చెబుతూ వీడియో రూపొందించిందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు దానిని షేర్‌ చేసిందని ఉద్వేగానికి లోనయ్యారు. కోవిడ్‌-19 వ్యాప్తిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా కరోనాతో ఇప్పటికే అమెరికాలో 14 వేల మందికి పైగా మరణించారు.(కరోనా: అమెరికాలో 11 మంది భారతీయుల మృతి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు