ఫ్లోరిడాలో మాథ్యూ దాటికి ముగ్గురు మృతి

8 Oct, 2016 09:42 IST|Sakshi
ఫ్లోరిడాలో మాథ్యూ దాటికి ముగ్గురు మృతి

వాషింగ్టన్: మాథ్యూ హరికేన్ అమెరికాపై ప్రభావం చూపుతోంది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో ఫ్లోరిడా తీరాన్ని తాకిన ఈ హరికేన్ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను దాటికి ఫ్లోరిడాలో ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హరికేన్ కారణంగా సకాలంలో వైద్యం అందక ఇద్దరు మృతిచెందగా.. చెట్టుకూలి మీదపడటంతో మరో మహిళ మృతిచెందారని అధికారులు తెలిపారు.

5 పాయింట్ల తుఫాను సూచిలో కేటగిరి 5 తుఫానుగా కరీబియన్ దీవులపై విరుచుకుపడిన మాథ్యూ హరికేన్ క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం 2 పాయింట్ల కేటగిరిలో చేర్చిన ఈ హరికేన్ అమెరికాలో ప్రభావం చూపుతోంది. దీని దాటికి వేలాది విమానాలు నిలిచిపోయాయి.  తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సుమారు 10 లక్షల ఇళ్లకు కరెంట్ కట్ చేశారు. డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ పర్యాటక కేంద్రాలను తుఫాను కారణంగా మూసేశారు.

అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు మ్యాథ్యూ హరికేన్ కరీబియన్ దీవుల్లో తీవ్రనష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైతీలో సుమారు 400 మంది హరికేన్ దాటికి మృత్యువాతపడ్డారు. ఇక్కడ ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యంలో సహాయకచర్యలు చేపడుతోంది.

మరిన్ని వార్తలు