విమానం ప్రమాదం: ముగ్గురు మృతి

6 Feb, 2020 13:29 IST|Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీలో విమాన ప్రమాదం జరిగింది. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎయిర్‌పోర్టులో  విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్‌వే నుంచి అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. విమానం అదుపుతప్పడంతో దాని నుంచి మంటలు చెలరేగి మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 179 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

దీనిపై టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఘటనలో ముగ్గురు టర్కీ వాసులు మృతి చెందగా.. 179 మందికి గాయాలయ్యాయని చెప్పారు. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారని, లేదంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అన్నారు. గాయపడిన వారిలో 12 మంది చిన్నపిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదని అధికారులు వెల్లడించారు. కాగా ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు