తెలుగమ్మాయికి గేట్స్‌ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్‌

12 Apr, 2017 01:58 IST|Sakshi
తెలుగమ్మాయికి గేట్స్‌ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్‌

లండన్‌: ప్రతిష్టాత్మక గేట్స్‌ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్‌–2017కుగాను తెలుగు రాష్ట్రాలకు చెందిన అఖిల దెందులూరి ఎంపికయ్యారు. ఈమెతోపాటు భారత్‌ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు సలోని అటల్‌(ముంబై), యైకోమ్బా ముతుమ్‌ (మణిపూర్‌)లు స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు కేంబ్రిడ్జి యూనివర్సిటి ప్రకటించింది. అఖిల హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ (2009–11)లో డిగ్రీ విద్యను అభ్యసించారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో మరో రెండేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీని కొనసాగించారు. తర్వాత 2013–15 మధ్య ‘ది జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ’నుంచి బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.

ప్రస్తుత స్కాలర్‌షిప్‌లో భాగంగా కెమిస్ట్రీలో పీహెచ్‌డీ విద్యను అభ్యసించనున్నట్లు ఆమె తెలిపారు. భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణకు దోహదపడేందుకు గాను సైకాలజీలో పీహెచ్‌డీ చేయ నున్నట్లు మరో విద్యార్థి సలోని అటల్‌ తెలిపారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో విద్యనభ్యసించిన ముతుమ్‌ తన పీహెచ్‌డీలో భాగంగా బయోలాజికల్‌ సైన్స్‌ను అభ్యసిస్తానని చెప్పారు. ఈ ఉపకారవేతనానికి ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 90 మందిని ఎంపిక చేసినట్లు వర్సిటీ పేర్కొంది. వీరందరికీ ఈ ఏడాది అక్టోబర్‌ తరగతులు ప్రారంభమవుతాయని వర్సిటీ తెలిపింది.

మరిన్ని వార్తలు