రంజాన్ షాపింగ్ లో బాంబుపేలుడు..

24 Jun, 2016 16:20 IST|Sakshi
రంజాన్ షాపింగ్ లో బాంబుపేలుడు..

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లో  భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్  ప్రావిన్స్ లో  శుక్రవారం బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ బాంబు పేలడంతో  పెద్ద ప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికిగా పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.   క్వెట్టా సిటీలో  రోడ్డు పక్కన పార్క్ చేసిన మోటార్  బైక్ లో అమర్చిన  బాంబు ఒక్కసారిగా పేలడంతో రంజాన్ షాపింగ్ లో  ఉన్న  ప్రజలు  పరుగులు తీశారు.  రంజాన్  పండుగ సందర్భంగా ఈ ఏరియాలో  షాపింగ్ సందడి నెలకొంటుంది.

సంఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.  దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ, తాలిబన్లు, బలోచ్  మిలిటెంట్ల కదలికలు ఈ ఏరియాలో చురుగ్గా  ఉంటాయి. దీంతో ఇది మిలిటెంట్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు