అమెరికాలో నిరుద్యోగ భృతికి 3.9 కోట్ల దరఖాస్తులు

21 May, 2020 20:10 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాను నిరుద్యోగ సమస్య అతలాకుతలం చేస్తోంది. వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం లక్షలాది అమెరికన్లు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంకా, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని లేబర్ డిపార్ట్‌మెంట్ గురువారం ప్రకటించింది. ఇక కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.(టార్గెట్‌ చైనా : కీలక బిల్లుకు సెనేట్‌ ఆమోదం)

ప్రపంచంలోనే ఏ దేశంలో లేనన్ని కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా అనేక కంపెనీలు మూతపడటంతో వేలాది మంది ఉద్యోగులు ఇళ్లలకే పరిమితమయ్యారు. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు.(అందుకే నాపై దుష్ప్రచారం: చైనాపై ట్రంప్‌ ఆగ్రహం)

మే9 వారంతంలో నమోదైన 30 లక్షల దరఖాస్తులతో పోలీస్తే, గత వారంతపు దరఖాస్తుల సంఖ్య 27 లక్షలతో తగ్గుదల కనిపించింది. ఇక మార్చి చివరి వారంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 69లక్షలతో పోలిస్తే, తొలిసారి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య వరుసగా 7 వారాలుగా తగ్గుతూ వస్తోంది. అయితే వరుసగా (రెండు వారాలకు మించి) నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య మాత్రం 2.5 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ఎంతమేర కోలుకుంటుందో అర్థం చేసుకోవడానికి దీర్ఘకాలంలో నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్యను ఆర్థిక నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.(హెచ్‌1బీతో అమెరికన్లకు నష్టం లేదు!)

మరిన్ని వార్తలు