పిల్లలను దారుణంగా చంపేసింది!

2 Jul, 2016 16:36 IST|Sakshi

మెంఫిస్ః  నలుగురు పిల్లలను దారుణంగా చంపేసిన తల్లి ఉదంతం అమెరికాలోని టెన్నెస్సీలో వెలుగు చూసింది. మెంఫిస్ నగర శివారులో జరిగిన ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. పదునైన ఆయుధంతో ఆ మహిళ నలుగుర్నీ పొడిచి చంపేసినట్లు మెంఫిస్ ప్రాంతంనుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలోని మెంఫిస్ ప్రాంతం టెన్నెస్సీలో చోటుచేసుకున్న ఘటన అక్కడి వారిని కలచి వేసింది. టెన్నెస్సీ  గేటెడ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో నలుగురు పిల్లలను ఓ తల్లి చంపేసిందంటూ తమకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చనిపోయిన నలుగురు పిల్లలతోపాటు, తల్లికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో ఆమెపై నేరాభియోగాలు నమోదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వెర్డెంట్ గోల్ఫ్ కోర్స్ సమీపంలోని ఆపార్టుమెంట్లో  ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు, కౌంటీ షరీఫ్ విలేకర్లు చెప్తున్నారు. పదునైన ఆయుధంతో చిన్నారులను ముక్కలు ముక్కలు చేసేందుకు ఆమెకు ఎలా మనసొప్పిందోనని, అంతటి దారుణానికి ఎలా ఒడిగట్టిందో తమకు తెలియడం లేదని ఇరుగు పొరుగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

అపార్ట్ మెంట్ లో విగతజీవులుగా పడి ఉన్న నలుగురు చిన్నారులను గుర్తించిన పోలీసులు.. తల్లిని కస్టడీలోకి తీసుకున్నారు. చిన్నారుల వయసు, పేర్లు మొదలైన వివరాలేమీ పోలీసు అధికారులు వెల్లడించలేదు. వారిని బేబీస్ అంటూ పిలుస్తున్నారు. అయితే షరీఫ్ కార్యాలయం మాత్రం వారంతా ఆరేళ్ళ లోపు వారేనని తెలిపింది. కాగా తల్లికి మానసిక సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడిన పోలీసులు హత్యలు జరిగిన సమయంలో చిన్నారుల  తండ్రి ఇంట్లో లేకపోకపోవడంపై కూడ దృష్టి సారించారు. దర్యాప్తుకోసం కావలసిన అన్నిరకాల సహకారాన్ని అందిస్తామని షెల్బీ కౌంటీ మేయర్ మార్క్ లుటరెల్ పోలీసులకు హామీ ఇచ్చారు. అయితే ఆ ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా.. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇంటి ముందు స్థలంలో ఆడుకుంటూ కనిపించేవారని,  అందరూ ఆరేళ్ళలోపు వారేనని ఓ పొరుగు వ్యక్తి తెలిపాడు. తాను తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ కు వెళ్ళేప్పుడు కూడ ఇష్టంగా పలకరించేవారని, నాకు తెలిసినంతవరకూ ఆ పిల్లలు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని వివరించాడు. ఇరుగు పొరుగువారు చెప్పిన వివరాలను సైతం నోట్ చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు