ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి

10 Jul, 2014 03:05 IST|Sakshi
ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి

గాజా/జెరూసలెం: హమాస్ తీవ్రవాద సంస్థ అధీనంలోని గాజాపై మంగళవారం వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ బుధవారం కూడా విమానాల నుంచి భారీగా  బాంబుల వర్షం కురిపించింది. మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో కొంతమంది మహిళలు, పిల్లలు సహా 17 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు, ఐదుగురు మహిళలు, ఒక మిలిటెంట్ ఉన్నారు. దీంతో రెండు రోజుల్లో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన పాలస్తీనియన్ల సంఖ్య 44కు చేరింది. ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’లో భాగంగా హమాస్ రహస్య రాకెట్ లాంచర్లు, కమాండ్ సెంటర్లు, సొరంగాలు సహా 440 చోట్ల దాడులు చేశామని, వీటిలో 300 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. బుధవారం హమాస్ కూడా తొలిసారి ఇజ్రాయెల్ అంతటా దాడులతో విరుచుకుపడింది.

ఇజ్రాయెల్ భూభాగంలో 180రాకెట్లు దూసుకొచ్చాయి. జెరూసలెంలో మూడు, టెల్‌అవీవ్‌లో 4 పడ్డాయి. అయితే ఎవరూ గాయపడలేదు. ఈ రెండు నగరాల్లో రాకెట్ల దాడుల బారి నుంచి తప్పించుకోవడానికి రక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. గత వారంలో వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు ఇజ్రాయెల్ టీనేజర్లు, జెరూసలెంలో ఒక పాలస్తీనా పౌరుడు హత్యకు గురికావడంతో తాజా ఘర్షణలు రేగాయి.
 

మరిన్ని వార్తలు