క‌రోనాను జ‌యించిన‌ ఐదు నెల‌ల శిశువు

1 Jun, 2020 12:35 IST|Sakshi

రియో డి జనీరో: చిన్నాపెద్దా తేడా లేని క‌రోనా ఐదు నెల‌ల వ‌య‌సున్న‌ శిశువును వ‌ద‌ల్లేదు. ఆ మ‌హ‌మ్మారి వ‌ల్ల కోమాలోకి కూడా వెళ్లిన ఆ శిశువు అంతిమంగా వైర‌స్‌నే జ‌యించిన‌ ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన‌ ఐదు నెల‌ల చిన్నారి డామ్‌కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా అనిపించింది. దీంతో శిశువు త‌ల్లిదండ్రులు బాబును స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. డామ్‌ను ప‌రీక్షించిన‌ వైద్యులు బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌గా భావించి మందులు రాసిచ్చారు. కానీ మందులు వాడిన‌ప్ప‌టికీ బాబు ఆరోగ్య ప‌రిస్థితి కుదుట‌ప‌డ‌లేదు. పైగా రోజురోజుకూ మ‌రింత క్షీణిస్తుండటంతో క‌ల‌వ‌ర‌ప‌డ్డ త‌ల్లిదండ్రులు రియో డి జనీరోలోని ప్రొ కార్డికో ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డి వైద్యులు బాబుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధారించారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్‌!)

అనంత‌రం చికిత్స అందించే స‌మ‌యంలో బాబు కొన్ని రోజుల పాటు కోమాలోకి వెళ్లాడు. దీంతో వైద్యులు అత‌డిని ర‌క్షించేందుకు వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు. సుమారు 54 రోజుల త‌ర్వాత ఆ శిశువు క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.  ఈ విష‌యం గురించి ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు మాట్లాడుతూ.. "ఇది నిజంగా అద్భుతం" అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. కాగా బ్రెజిల్‌లో 12 నెల‌ల లోపు వ‌య‌సు ఉన్న చిన్నారులు 25 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వ‌విద్యాల‌యం ప్రకారం అమెరికాలో 5,14,849 కేసులు న‌మోద‌వ‌గా 29,300 మంది మ‌ర‌ణించారు. (చనిపోతే బతికించారు.. మళ్లీ ‘చంపేశారు’!!)

మరిన్ని వార్తలు