‘నా పేరు కైరా.. వీలైతే బదులివ్వండి’

8 Apr, 2020 10:18 IST|Sakshi

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ ప్రపంచమంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. దాదాపు ప్రతీ దేశంలోనూ లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉన్నాయి. కోవిడ్‌-19తో చనిపోయిన వారికే కాకుండా సహజ మరణం పొందిన వారి అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టతరంగా మారింది. ప్రజలంతా ఇంటికే పరిమితమై దినదినగండంలా కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో అత్యధిక మంది వృద్ధులే ఉన్నారని గణాంకాలు చెబుతున్న తరుణంలో కుటుంబ సభ్యులు వారి పట్ల మరింత శ్రద్ధ వహిస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ చిన్నారి తన ఇంట్లో వాళ్లతో పాటు పక్కింటి 93 ఏళ్ల తాతాయ్య ఆరోగ్యం గురించి కూడా బెంగ పెట్టుకుంది. కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఆయనకు లేఖ రాసింది.

‘‘హలో.. నా పేరు కైరా. నాకు ఐదేళ్లు. కరోనా వైరస్‌ కారణంగా నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. మీరు జాగ్రత్తగానే ఉన్నారా లేదా అన్న విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి. వీలైతే నా లేఖకు బదులివ్వండి’’అని సదరు చిన్నారి లేఖలో రాసుకొచ్చింది. ఇక పక్కింటి ‘మనుమరాలు’తన గురించి ఇంతలా ఆలోచిస్తూ.. ముద్దు ముద్దుగా లేఖ రాస్తే ఆ వృద్ధుడు బదులివ్వకుండా ఉంటాడా?.. ‘‘హలో కైరా.. నీ మెసేజ్‌ నాకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. కరోనా వైరస్‌ చాలా చెడ్డది. అయినప్పటికీ మనమంతా కలిసి దానిని అధిగమిద్దాం. నేను ర్యాన్‌. నువ్వు గీసిన ఇంద్రధనుస్సును నేను చూస్తాను. నాపై నువ్వు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’’అని బదులిచ్చాడు.

ఇక ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్న ర్యాన్‌ అసలు మనుమరాలు.. ఇద్దరి లేఖలను ట్విటర్‌లో షేర్‌ చేసింది. అప్పటి నుంచి చిన్నారి కైరాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా