పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!

13 Apr, 2016 20:52 IST|Sakshi
పట్టించుకోకుంటే పని కోల్పోయినట్లే!

మానసిక అనారోగ్యంతో కొన్ని వేల సంవత్సరాల పని శక్తిని కోల్పోతాం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న మానసిక అనారోగ్యం వల్ల వచ్చే 2030 సంవత్సరం నాటికి సుమారు 12 బిలియన్ల పనిరోజులు లేదా 50 మిలియన్ సంవత్సరాల పని వృధా అయిపోతుందని డబ్ల్యూహెచ్ ఓ తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది.  

మానసిక ఒత్తిడి, ఆత్రుత వంటి లక్షణాలకు చికిత్స అందించడంలో వైఫల్యం చెందితే సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక ఉత్పాదకతలో 925 బిలియన్ డాలర్ల ఖరీదైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వరల్డ్ హెల్గ్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యయనాల ప్రకారం తెలుస్తోంది. సాధారణ మానసిక అనారోగ్య చికిత్సకోసం పెట్టుబడి, ఆరోగ్య ఆర్థిక ప్రయోజనాలు పై ప్రపంచంలోనే  మొదటిసారి విశ్లేషణ జరిపిన సంస్థ తన పరిశోధనా వివరాలను ల్యాన్సెట్ సైకియాట్రీ లో ప్రచురించింది. మానసిక ఒత్తిడి అనారోగ్యాల చికిత్సకు  వెచ్చించే ఒక డాలర్... ఆరోగ్యంతోపాటు తిరిగి 4 డాలర్ల ఖరీదైన ఉత్పాదకతను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి.

మానసిక ఒత్తిడి, అనారోగ్యాలకు చికిత్స అందించడం పై దృష్టి పెట్టకపోవడం, ఓ మానవ తప్పిదంగానూ, పిసినారితనంగానూ కనిపిస్తోందని, అన్ని దేశాలు మానసిక ఆరోగ్య సేవలపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం సగటున మూడు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయని నివేదిక ద్వారా వెల్లడైంది.

వచ్చే 15 సంవత్సరాల్లో కౌన్సెలింగ్, యాంటీ డిప్రెషన్ మందులకోసం 147 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే...  399 బిలియన్ డాలర్ల ఖరీదైన కార్మిక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచ జనాభాలో దాదాపు పదిశాతం మంది అంటే సుమారు 740 మిలియన్లమంది  ఇప్పుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులోనూ సాధారణ మానసిక అనారోగ్యం క్రమంగా పెరుగుతోందని తాజా  అధ్యయనాల్లో తేలింది. 1990 నుంచి 2013 మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఆందోళన, వ్యాకులత దాదాపు సగం పెరిగింది.

అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు వల్ల వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, 20 శాతం ప్రజలు అటువంటి సంఘటనలవల్లే ఒత్తిడికి గురౌతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. ఇది ఓ ప్రజారోగ్య సమస్య కాదని, అభివృద్ధి సమస్యగా గుర్తించాలని, నిరాశ, ఆత్రుత వంటి వాటికి చికిత్సను అందిస్తే... అది ఆర్థిక అభివృద్ధికి మంచి అర్థాన్ని తెస్తుందని తమ పరిశోధనల్లో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు