కారాగారాల్లోనూ కోవిడ్‌

22 Feb, 2020 03:46 IST|Sakshi
ఫిలిప్పీన్స్‌లోని బాకోలోడ్‌ సిటీలో సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లాడాక మాస్క్‌లతోనే ముద్దు పెట్టుకుంటున్న 220 కొత్త జంటలు

2,236కి చేరిన మృతులు

బీజింగ్‌: కోవిడ్‌–19(కరోనా వైరస్‌) ఇప్పుడు చైనాలో జైళ్లనూ వణికిస్తోంది. ఖైదీలకు కోవిడ్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో 500కి పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. వూహాన్‌లో మహిళా జైలులో అత్యధికంగా కేసులు నమోదైనట్టుగా జైళ్ల శాఖ తెలిపింది. షాండాంగ్‌ ప్రావిన్స్‌లో రెంచెంగ్‌ జైలులో 200 మంది ఖైదీలు, ఏడుగురు గార్డులకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో సమగ్ర దర్యాప్తుకి ఆదేశించిన ప్రభుత్వం రెంచెంగ్‌ జైలుకి చెందిన ఏడుగురు అధికారుల్ని సస్పెండ్‌ చేసింది.  

ఒక్కరోజే 118 మంది మృతి  
కరోనా మృతులు రోజు రోజుకి పెరుగుతున్నారు. హుబాయ్‌ ప్రావిన్స్‌లో ఒక్కరోజే 118 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,236కి చేరుకుంది. ఇప్పటివరకు 75,400 కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు వ్యాధి భయంతో మాస్క్‌ల వినియోగం బాగా పెరిగింది. దీంతో డిమాండ్‌కి తగ్గ సప్లయి లేక భారీగా కొరత ఏర్పడింది. దీంతో హాంగ్‌కాంగ్‌లో చాలామంది సొంతంగా మాస్క్‌లు తయారు చేసుకుంటున్నారు. కొందరు జేబు రుమాళ్లకే ఎలాస్టిక్‌ తగిలించి మాస్క్‌గా వాడుతున్నారు.  

మెరుగుపడుతున్న భారతీయుల ఆరోగ్యం  
జపాన్‌ తీర ప్రాంతంలో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో కరోనా వైరస్‌ సోకిన భారతీయుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. కరోనా సోకిన ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని జపాన్‌లో భారత్‌ రాయబార కార్యాలయం వెల్లడించింది.  

ఇజ్రాయెల్, లెబనాన్‌ దేశాలకూ వ్యాప్తి  
కోవిడ్‌ వ్యాప్తి చెందిన దేశాల జాబితాలో తాజాగా మరో రెండు దేశాలు చేరాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. తాజాగా డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి ఇజ్రాయెల్‌కి చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి కోవిడ్‌ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఆ నౌకలో మొత్తం 15 మంది ఇజ్రాయెల్‌ దేశస్తులు ఉంటే వారిలో నలుగురికి కరోనా ఉన్నట్టు తేలడంతో అక్కడే ఉంచి చికిత్స చేస్తున్నారు. మిగిలిన 11 మందిని వారి దేశానికి పంపారు. అయితే ఇజ్రాయెల్‌కు చేరుకున్నాక ఒక ప్రయాణికుడికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇక లెబనాన్‌లో 45 ఏళ్ల వయసున్న ఒక మహిళకు వైరస్‌ సోకినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.   
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా