మరణాలు 5 వేలు.. కేసులు 1.34 లక్షలు

14 Mar, 2020 04:41 IST|Sakshi
రాకపోకలపై నిషేధం కారణంగా నిర్మానుష్యంగా మారిన స్పెయిన్‌లోని ఓ రోడ్డు.. పహారా కాస్తున్న పోలీసు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 విజృంభణ

ఇరాన్‌లో ఒక్కరోజే 85 మంది మృత్యువాత

కెనడా ప్రధాని భార్యకు, ఆస్ట్రేలియా మంత్రికి సోకిన వైరస్‌

టెహ్రాన్‌/ఒట్టావా/పారిస్‌/వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ కోవిడ్‌–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య చైనాలోనే అత్యధికం. అక్కడ 3,176 మంది చనిపోయారు.

ఇరాన్‌ లాక్‌డౌన్‌
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 24 గంటల్లో సైనిక దళాలు ఇరాన్‌ వీధులన్నింటినీ స్వాధీనం చేసుకుంటాయని, ఆ తరువాత ప్రతీ పౌరుడికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతామని శుక్రవారం ప్రకటించింది. కరోనాపై యుద్ధంలో సైనిక దళాలు ప్రధాన పాత్ర పోషించాలని సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ ఆదేశించారు. ఇప్పటికే శుక్రవారం సామూహిక  ప్రార్థనలను ఇరాన్‌ రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఈ వైరస్‌ కారణంగా ఇరాన్‌లో గురువారం ఒక్కరోజే 85 మంది మృత్యువాత పడ్డారు.

1,289 మందికి కొత్తగా ఈ వైరస్‌ సోకింది. మొత్తంగా ఆ దేశంలో కోవిడ్‌–19 వల్ల మృతి చెందిన వారి సంఖ్య 514కి, మొత్తం కేసుల సంఖ్య 11,364కి చేరింది. కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయినవారిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతొల్లా ఖమేనీ విదేశీ వ్యవహారాల సలహాదారు అలీ అక్బర్‌ వెలాయతి కూడా ఉన్నారు. దేశ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, రెవల్యూషనరీ గార్డ్స్‌ సభ్యులు, ఆరోగ్య శాఖలోని పలువురు అధికారులు కూడా ఈ వైరస్‌ బారిన పడినట్లు అధికార టీవీ ప్రకటించింది.

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా.. ఈ వైరస్‌ కట్టడికి అవసరమైన ఔషధాలు, ఇతర వైద్య పరికరాల దిగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందువల్ల తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్‌ యూఎస్‌ను కోరింది. మరోవైపు, ఇటలీలో చిక్కుకుపోయిన భారతీయులను భారత్‌కు తీసుకువచ్చేందుకు వీలుగా.. వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు భారత వైద్యుల బృందం శుక్రవారం ఇటలీ చేరుకుంది.

ఇప్పుడు కరోనా కేంద్రం.. యూరోప్‌
కరోనా వైరస్‌ కేంద్ర స్థానం ఇప్పుడు యూరోప్‌కి మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం యూరోప్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఈ విశ్వవ్యాప్త మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ పేర్కొన్నారు.  ఇటలీలో మృతుల సంఖ్య 1000 దాటింది. మొత్తం 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలోని లాంబర్డీ ప్రాంతంలో ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల్లో కేసుల సంఖ్య 2 వేల చొప్పున నమోదయ్యాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లొవేకియాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

వైరస్‌ భయానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విదేశాల నుంచి రాకపోకలపై నియంత్రణలను విధించాయి. కళాశాలలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే సౌకర్యం కల్పించాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలు కూడా నిలిచిపోయాయి. విమానాశ్రయాలు, రహదారులు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు విందు, వినోదాల కు దూరంగా, ఇంట్లోనే ఉంటున్నారు. బృంద కార్య క్రమాలపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. అమెరికాలో కేసుల సంఖ్య 16 వందలకు చేరింది. మరోవైపు, నేపాల్‌ ఎవరెస్ట్‌ సహా అన్ని పర్వతారోహణ కార్యక్రమాలపై నిషేధం విధించింది.

అమెరికా నుంచే ఆ వైరస్‌?
అమెరికా నుంచి వచ్చిన యూఎస్‌ సైన్యం ద్వారానే కరోనా వైరస్‌ చైనాకు చేరిందని చైనా అధికారి ఒకరు చేసిన ఒక ట్వీట్‌ అమెరికా, చైనాల మధ్య వివాదానికి దారితీసింది.

కెనడా ప్రధాని భార్యకు కోవిడ్‌–19
కెనడా ప్రధానమంత్రి జస్టిస్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు కరోనా వైరస్‌ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. దాంతో,  భార్యతో పాటు జస్టిన్‌ ట్రూడో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆస్ట్రేలియా సీనియర్‌ మంత్రి పీటర్‌ డటన్‌కు కూడా కరోనా కన్ఫర్మ్‌ అయింది. 

మరిన్ని వార్తలు