54 మంది సుడాన్ సైనికులు మృతి

29 Mar, 2015 09:49 IST|Sakshi

ఖర్దూమ్:  సుడాన్ దేశంలో 54 మంది సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు. అనంతరం అక్కడే ఉన్న దక్షిణ కోర్దాఫన్లోని హబిలా అనే వ్యూహాత్మక నగరాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తిరుగుబాటుదారులే తెలియజేశారు. ఉత్తర సెక్టార్లోని సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూమెంట్ (ఎస్పీఎల్ ఎం)  సంస్థ అల్ దలాంజ్ నగరానికి 30 కిలో మీటర్ల దూరంలోని హబీలా నగరానికి స్వేచ్ఛ కావాలనే పేరుతో ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకునేందుకు చొచ్చుకొచ్చి అడ్డొచ్చిన సైనికులను దారుణంగా చంపేసింది.

చివరికి హబీలా నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఎస్పీఎల్ ఎం తిరుగుబాటు సంస్థ అధికారిక ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు హబీలాకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపాడు. అయితే, సైన్యం ఈ విషయాలను కొట్టిపారేసింది. హబీలా ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని, తిరుగుబాటు దారులు మాత్రం దాడులకు పాల్పడ్డారని, ప్రస్తుతం వారితో పోరు సాగుతుందని సుడాన్ సైన్యం ప్రకటించింది. బాంబులతో వారు దాడి చేయడం వల్ల తమ సైనికులను కోల్పోయామని, వారిని వీలయినంత త్వరగా తుదముట్టిస్తామని స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు