కరోనా: 59 వేల మరణాలను నివారించారు!

31 Mar, 2020 17:13 IST|Sakshi

లండన్‌: కరోనా కట్టడికి చేపట్టిన చర్యలతో ఐరోపాలో వేల సంఖ్యలో మరణాలను నివారించినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. సామాజిక దూరం పాటించడం, పాఠశాలలను మూసివేయడం, లాక్‌డౌన్‌ వంటి చర్యల కారణంగా బ్రిటన్‌తో సహా 11 ఐరోపా దేశాల్లో కనీసం 59 వేల మరణాలను నివారించగలిగారని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకుల అధ్యయం తెలిపింది. సరైన సమయంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు చేపట్టడంతో పెను ముప్పు తప్పినట్టు పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితాలను అంచనా వేయడానికి సరికొత్త నమూనాను ఉపయోగించినట్టు తెలిపింది. మార్చి చివరి వరకు 21,000 నుంచి 120,000 మధ్య మరణాలు నివారించబడతాయని లెక్కించినట్టు వివరించింది. ఈ గణాంకాల ఆధారంగా మార్చి 31 నాటికి 59 వేల మరణాలను నివారించే అవకాశముందని అంచనా వేశామని తెలిపింది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గిపోయే వరకు ఆంక్షలు కొనసాగిస్తే మరణాలను ఇంకా ఎక్కువగా నివారించవచ్చు. ఐరోపాలోని 11 దేశాల్లో 7 నుంచి 43 మిలియన్ల మంది మార్చి 28 నాటికి సార్స్‌-కోవ్‌-2 బారిన పడతారని అంచనా వేశాం. కరోనా మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంక్షలు విధించకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. సరైన సమయంలో ఆంక్షలు విధించడం అనేది చాలా కీలకమ’ని అధ్యయనకర్త అక్సెల్‌ గ్రాండీ పేర్కొన్నారు. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నార్వే, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా అధ్యయం చేసినట్టు వెల్లడించారు. 

దేశంలోని మొత్తం జనాభాతో పోల్చిచూసినప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్న యూరప్‌ దేశాల్లో స్పెయిన్‌ ముందువరుసలో నిలిచింది. ఇటలీ రెండో స్థానంలో ఉంది. జర్మనీ, నార్వే దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని అధ్యయంలో తేలింది. ఇటలీలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటిపోగా, స్పెయిన్‌ లక్షకు చేరువయింది. ఇటలీలో ఇప్పటివరకు 101,739, స్పెయిన్‌లో 94,417 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇటలీలో 11,591, స్పెయిన్‌లో 8,189 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలంటే!)

>
మరిన్ని వార్తలు