5జీతో క‌రోనా దుర్మార్గ ప్ర‌చారం: బ‌్రిట‌న్‌

5 Apr, 2020 10:10 IST|Sakshi

క‌రోనా వైర‌స్‌పై ఎన్నో త‌ప్పుడు క‌థ‌నాలు విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. దీన్ని నివారించ‌డం ప్ర‌భుత్వాల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ స‌మ‌యంలో మ‌రో వార్త అంద‌రినీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. తాజాగా 5జి ఫోన్‌ సిగ్న‌ల్స్ ద్వారా క‌రోనా వ్యాప్తి చెందుతున్న ప్ర‌చారం బ్రిట‌న్‌లో ఊపందుకుంది.  దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ప‌లు చోట్ల ట‌వ‌ర్‌ల‌ను త‌గుల‌బెడుతున్నారు. దీనిపై మొబైల్ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ట‌వ‌ర్ల‌ను త‌గుల‌బెడుతూ త‌మ సిబ్బందిని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నార‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విష‌యంపై స్పందించిన‌ బ్రిట‌న్ ప్ర‌భుత్వం క‌రోనాకు, 5జి నెట్‌వ‌ర్క్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. (రండి.. దీపాలు వెలిగిద్దాం)

ఈ మేర‌కు బ్రిట‌న్ మంత్రి మైకేల్ గోమ్ మాట్లాడుతూ.. ఇది ఓ దుర్మార్గ‌మైన అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేశారు. ట‌వ‌ర్ల‌ను ధ్వ‌సం చేయ‌డంపై ఇంగ్లండ్‌లోని ఎన్‌హెచ్ఎస్ (నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్‌) మెడిక‌ల్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ పోయిస్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 5జీ క‌థ‌నాల‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, ఇదో ప్ర‌మాద‌క‌ర‌మైన త‌ప్పుడు క‌థ‌నంగా అభివ‌ర్ణించారు. నిజానికి ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితిలో ఫోన్ సిగ్న‌ల్స్ అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. కాగా ట‌వ‌ర్ల నుంచి వ‌చ్చే సిగ్న‌ల్స్‌తో క‌రోనా వ‌స్తుంద‌న్న అపోహ‌ల‌తో ఇంగ్లాండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్, మెర్సిసైడ్ ప్రాంతాల్లో ప‌లు ట‌వ‌ర్లు ధ్వ‌సం అయ్యాయి. ఈ విష‌యం గురించి బ్రిట‌న్‌లోని ఓ మొబైల్ నెట్‌వ‌ర్క్ అధికారి మాట్లాడుతూ.. 5జీపై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారాలు నిరాధార‌మ‌ని, ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వద్ద‌ని సూచించారు. (త్వరలో రిలయన్స్‌ జియో 5జీ టెక్నాలజీ)

మరిన్ని వార్తలు