దొంగ‌త‌నం కేసును ప‌రిష్క‌రించిన బుడ్డోడు

22 May, 2020 17:52 IST|Sakshi

కొలంబియా: ఏళ్ల‌ త‌ర‌బ‌డి సమాధానం దొర‌క‌ని కేసును ఓ బుడ‌త‌డు చిటికెలో ప‌రిష్కరించాడు. ఈ ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న అమెరికాలోని ద‌క్షిణ కరోలినాలో చోటు చేసుకుంది.  వివ‌రాల్లోకి వెళితే.. కరోలినాలో కొన్నేళ్ల క్రితం దొంగ‌త‌నం కేసు న‌మోదైంది. ఆ కేసులో చోరీ అయిన విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు వేటినీ పోలీసులు క‌నుగొన‌లేక‌పోయారు. దీంతో అది ఎటూ తేల‌కుండా మిగిలిపోయింది. ఇదిలా వుండ‌గా లాక్‌డౌన్ టైంలో బోర్ కొడుతోంద‌ని జాన్స్ ఐలాండ్‌కు చెందిన‌ నాక్స్ బ్రేవ‌ర్ అనే కుర్రాడు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మాగ్నెట్ ఫిషింగ్‌కు వెళ్లాడు. అంటే అయ‌స్కాంత గాలంతో నీళ్ల‌లో ఉన్న‌ మెట‌ల్ వ‌స్తువులు వెలుగు తీయ‌డం అన్న‌మాట‌. విట్నీ స‌ర‌స్సులో గాలం వేయ‌గా నీళ్ల అడుగు భాగాన‌ ఓ వ‌స్తువు గాలానికి త‌గిలింది. (‘ఇవి బంగారం కాదు.. నిజంగా ప్రకృతి అద్భుతం’)

అది బ‌రువుగా ఉండ‌టంతో  దాన్ని పైకి తీసేందుకు పిల్ల‌వాడు ఎంత‌ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో ఇత‌రుల స‌హాయం తీసుకుని ఎలాగోలా శ‌క్తినంతా కూడ‌దీసుకుని లాగ‌డంతో ఓ పెట్టె బ‌య‌ట ప‌డింది. అందులోని వ‌స్తువుల‌ను చూసి అక్క‌డున్న వాళ్ల క‌ళ్లు జిగేల్‌మ‌న్నాయి. ఆ పెట్టె నిండా ధ‌గ‌ధ‌గ మెరిసే న‌గ‌లు, ఖ‌రీదైన వ‌స్తువులు క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ ఉన్నాయి. దీంతో బుడ్డోడి తండ్రి దీని వెన‌క ఏదో పెద్ద క‌థే ఉంటుంద‌ని భావించి అధికారుల‌కు స‌మాచార‌మిచ్చారు. వెంట‌నే పోలీసులు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఖ‌జానా పోగొట్టుకున్న మ‌హిళ‌ను పిలిపించి ఆమెకు అంద‌జేశారు. ఆమె పోగొట్టుకున్న‌వి ఇన్నేళ్ల త‌ర్వాత తిరిగి ద‌క్క‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధుల్లేవు. దీనికి కార‌ణ‌మైన పిల్లోడి ముందు మోకాలిపై మోక‌రిల్లి అత‌డిని మ‌న‌సారా హ‌త్తుకుని కృత‌జ్ఞ‌తలు తెలిపింది. (‘బుద్ధుందా.. లాక్‌డౌన్‌లో ఇలాంటి పిచ్చి వేషాలా?’)

మరిన్ని వార్తలు