అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

15 Jun, 2019 11:23 IST|Sakshi

వాషింగ్టన్‌ : వడదెబ్బతో ఆరేళ్ల భారతీయ చిన్నారి మృతి చెందిన సంఘటన అందరిని కలచి వేస్తోంది. వివరాలు.. గురుప్రీత్‌ కౌర్‌ అనే బాలిక తన తల్లితో కలిసి మెక్సికో బార్డర్‌ ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో స్మగ్లర్స్‌ తల్లీకూతుళ్లిద్దరితో పాటు మరో ఐదుగురు భారతీయ వలసదారులను మంగళవారం ఉదయం అమెరికా సరిహద్దులోని ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి ప్రాంతంలో వదిలి వెళ్లారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బాలిక తల్లి కూతుర్ని మిగతావారివద్ద  వదిలి.. మరో మహిళతో కలిసి నీటి కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లింది. అలా నీటి కోసం వెళ్లిన వారు మరి వెనక్కి తిరిగి రాలేదు. వడ దెబ్బ కొట్టడంతో వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు.

మరుసటి రోజు బార్డర్‌ పెట్రోల్‌ ఏజెంట్‌ వారి పాద ముద్రల ఆధారంగా నడుచుకుంటూ వెళ్లగా ఓ చోట ఇద్దరు మహిళలు పడి పోయి ఉండటం గమనించాడు. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వివరాలు సేకరించాడు. ఇద్దరు మహిళలకు ఇంగ్లీష్‌ రాకపోవడంతో వారితో మాట్లడటం చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గురుప్రీత్‌ సైగల ద్వార తన కూతురు గురించి అధికారులకు తెలియజేసింది. తాము నీటి కోసం వెదుకుతూ.. వచ్చామని.. తన కూతురు వేరే చోట ఉందని తెలియజేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఓ మైలు దూరంలో వారికి గురుపీప్రత్‌ కౌర్‌ మృత దేహం కనిపించింది.

కొన్ని గంటల పాటు నీరు లేక తీవ్రమైన ఎండలో ఉండటం మూలానా గురుప్రీత్‌ మృతి చెందింది. బాలిక మృతికి స్మగ్లర్స్‌నే నిందిస్తున్నా‍రు అమెరికా సరిహద్దు భద్రత అధికారులు. అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూశారని.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా ల్యూక్‌విలే అరిజోనా ప్రసిద్ధికెక్కింది. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంత వేడి వాతావరణం మూలానే సదరు బాలిక మృతి చెందిందని వైద్యులు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది వడదెబ్బ వల్ల ఇద్దరు మృతి చెందగా వారిలో గురుప్రీత్‌ ఒకరు కావడం విచారం. మరి కొద్ది రోజుల్లోనే గురుప్రీత్‌ ఏడవ పుట్టిన రోజు జరుపుకోబోతుండగా.. ఈ విషాదం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు