ఆమె ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్..

9 Oct, 2015 11:22 IST|Sakshi
ఆమె ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్..

నైరోబి: ఐవరీ క్వీన్గా పిలుచుకునే ఓ అరవై ఆరేళ్ల మహిళది ఆఫ్రికా వన్యప్రాణుల స్మగ్లింగ్ వ్యాపారం సామ్రాజ్యంలో అందెవేసిన చేయి. యాంగ్ ఫెంగ్ గ్లాన్ అనే మహిళ గత పదిహేనేళ్లుగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఆఫ్రికా నుంచి ఇప్పటివరకు 700 ఏనుగుల దంతాలు స్మగ్లింగ్ చేయడంలో ఆమెది కీలకపాత్ర అని అధికారులు వెల్లడించారు. మేం ఓ షార్క్ను వేటాడుతున్నామంటూ ఓ సీనియర్ ఆఫీసర్ పేర్కొనడం గమనార్హం. గత కొన్నేళ్ల నుంచి చైనా- ఆఫ్రికాల మధ్య వ్యాపార లావీదేవీలు భారీ ఎత్తున జరుగుతుండటంతో పాటు, చైనాకు చెందిన స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేయడంతో యాంగ్ ఫెంగ్ నిజస్వరూపం బట్టబయలైంది.

ఆఫ్రికా నుంచి జరుగుతున్న స్మగ్లింగ్ విషయంపై టాంజానియా అధికారులు మరిన్ని వివరాలు వెల్లడించారు. 2009 నుంచి 2014 మధ్యకాలంలో ఏనుగుల సంఖ్య 1,09,051 నుంచి 43,330కు పడిపోయింది. యాంగ్ ఫెంగ్ తన స్మగ్లింగ్ వ్యాపారాన్ని చైనా, టాంజానియా దేశాలతో కొనసాగిస్తోందని పేర్కొన్నారు. గతవారం అరెస్ట్ చేయాలని ఆమె ఇంటికి వెళ్లగా, కిటీకి లోంచి బయటకు దూకి తప్పించుకుందని, అనంతరం ఎలాగోలా శ్రమించి యాంగ్ ఫెంగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

1970లలో ఆయాంగ్ ఫెంగ్ గ్లాన్ ఆఫ్రికాకు వలస వచ్చిందని, తొలి రోజుల్లో ఆమె అనువాదకురాలిగానూ పనిచేసిందని తెలిపారు. తూర్పు ఆఫ్రికాలో, చైనాలోని బీజింగ్ లలో ఆమెకు రెస్టారెంట్లు ఉన్నాయని సమాచారం. 2012లో టాంజానియా చైనా-ఆఫ్రికా వాణిజ్య మండలికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన యాంగ్, వందల కోట్ల రూపాయలలో స్మగ్లింగ్ కు పాల్పడుతోందన్నారు. దీంతో ఆమె ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అని, ఆమెను కఠినంగా శిక్షించాలని అధికారులు భావిస్తున్నారు. తనకున్న పలుకుబడితో అరెస్ట్ కాకుండా ఇప్పటివరకూ తప్పించుకోగలిగిందని, ఇక ఆమె ఆటలు సాగవని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు