హ్యాకింగ్‌తో 673 కోట్ల చోరీ

16 Mar, 2016 01:49 IST|Sakshi
హ్యాకింగ్‌తో 673 కోట్ల చోరీ

బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా
 
 ఢాకా: అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఖాతా నుంచి సుమారు 10.1 కోట్ల డాలర్ల (రూ.673 కోట్లు)  సొమ్ము గల్లంతైన ఉదంతంపై బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అతీవుర్ రహ్మాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి షేక్ హసీనాను కలసి రహ్మాన్ తన రాజీనామా లేఖను అందజేశారని ప్రధాని కార్యాలయ ప్రతినిధి ఇషానుల్ కరీం మీడియాకు తెలిపారు.అమెరికా బ్యాంకు ఖాతాలో ఉన్న బంగ్లా ప్రభుత్వ నిధులను గుర్తుతెలియని హ్యాకర్లు కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది. కొన్ని వారాల కిందట వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంగ్లా ప్రభుత్వాన్ని కుదిపేసింది.

ఏడేళ్లపాటు ఈ పదవిలో ఉన్న రహ్మాన్ అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, దేశ హితం కోసం తాను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. నిధుల దొంగిలింపు వ్యవహారం మిలిటెంట్ల దాడిలా ఉంద న్నారు. హ్యాకర్లు 10.1 కోట్ల డాలర్లను కొల్లగొట్టారని, 8.1 కోట్ల డాలర్లు ఫిలిప్పీన్స్‌కు, మిగతా డబ్బులు శ్రీలంకకు తరలించారని బ్యాంకు ప్రతినిధి తెలిపారు. శ్రీలంకకు చేరిన సొమ్ములోంచి కొంత రికవరీ చేశామని, ఫిలిప్పీన్స్‌కు చేరిన సొమ్ము క్యాసినోల వ్యాపారంలోకి మళ్లించి నట్లు తెలిసిందన్నారు. హ్యాకర్లు బంగ్లా ప్రభు త్వ రహస్య సమాచారాన్ని దొంగిలించి ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగానే నిధుల బదిలీకి అభ్యర్థనలు పంపారని, అయితే శ్రీలంకలోని ఒక సంస్థకు బదిలీకి సంబంధించి స్పెల్లింగ్ తప్పుగా ఇవ్వడంతో పునఃపరిశీలన చేయగా వ్యవహారం బయటకు వచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు