అమెరికా మాకు శత్రుదేశమే

2 Jan, 2018 14:13 IST|Sakshi

వాషింగ్టన్‌ : గత 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు లక్షల కోట్ల రూపాయల నిధులను ఉదారంగా ఇస్తున్నా.. అక్కడి ప్రజలు మాత్రం అమెరికాను శత్రుదేశంగానే పరిగణిస్తున్నారని ప్యూ సర్వే సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరులో అమెరికా సైనికులు భారీగా మృత్యుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు, ఆల్‌ ఖైదాతో జరిగిన పోరులో 499 మంది అమెరికా సైనికులు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం మొదలైన క్షణం నుంచీ పాకిస్తాన్‌కు అమెరికా భారీగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది. లక్షల కోట్ల అమెరికా నిధులు తీసుకుంటున్నా.. మెజారిటీ పాకిస్తానీలు మాత్రం ఆ దేశాన్ని శత్రుదేశంగా పరిగణించారని సర్వే సంస్థ బట్టబయలు చేసిం‍ది. మొత్తం పాకిస్తాన్‌ జనాభాలో 70 శాతం మంది అమెరికాను ద్వేషిస్తున్నారని ప్రకటించింది.

అమెరికాలో పేరొందిన ప్యూ రీసెర్చ్ సర్వే సంస్థ 2008 నుంచి పాకిస్తాన్‌ ప్రజల అభిప్రాయలపై సర్వే నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఇక్కడి ప్రజల్లో అమెరికాపై ద్వేషభావం పెరుగుతున్న విషయాన్ని సర్వేలో అధికారులు గుర్తించారు. ఇక 2012 సర్వేలో అయితే.. ప్రతి నలుగురు పాకిస్తానీల్లో ముగ్గురు అమెరికాను శత్రుదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2008లో 64 శాతం ఉండగా.. 2009 నాటికి 69 శాతానికి పెరిగింది. ఇక 2012లో అయితే 74 శాతం మంది పాకిస్తానీలు అమెరికాపై ద్వేషంతో ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగి ఉండొచ్చని ప్యూ రీసెర్చ్‌ సర్వే సంస్థ అంచనా వేసింది.

ఇదిలావుండగా.. అమెరికా విడుదల చేస్తున్న నిధులు దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని.. ప్రతి పదిమందిలో నలుగురు పాకిస్తానీలు భావిస్తున్నారు. మొత్తం పాకిస్తాన్‌ జనాభాలో కేవలం 17 శాతం మంది మాత్రమే అమెరికా సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు