ఆ అడవిలో కార్లకు 70 ఏళ్లు..!

18 Feb, 2016 15:57 IST|Sakshi
ఆ అడవిలో కార్లకు 70 ఏళ్లు..!

ఈ ఫోటోలోని కార్లను చూస్తే మీకేమనిపిస్తోంది..? ఈవిల్‌డెడ్ సినిమా లొకేషన్‌లా ఉంది కదా...! కానీ ఈ ప్రాంతం నిజంగా ఉంది. 70 ఏళ్ల నుంచి ఈ కార్లు ఆ ప్రాంతంలో అలానే ఉన్నాయి. మరి ఆ కార్లు ఎవరివో, అక్కడెందుకున్నాయో  తెలుసుకుందామా...? అది బెల్జియంలోని చాటిలాన్ అనే మారుమూల గ్రామం.
 
అక్కడ ఓ దట్టమైన అడవి ఉంది. అందులో హాలీవుడ్ హార్రర్ సినిమా లొకేషన్‌కి ఏమాత్రం తీసిపోని ప్రాంతం ఉంది. మామూలుగా అడవి అంటే జంతువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ అడవిలో జంతువులతో పాటు కార్లు కూడా ఉంటాయి. అలా అని పదో, ఇరవయ్యో కార్లు అనుకుంటే మీరు కారులో కాలేసినట్లే...! అలాంటి కార్లు ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.
 
అందుకే వదిలేశారు..!?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యాలు భారీ సంఖ్యలో  బెల్జియం గడ్డపై మోహరించాయి. వీరి సైనిక బలం ఆరు లక్షలు. వీరిలో చాలా మందికి కార్లున్నాయి. యుద్ధం ముగిసిన అనంతరం ఈ సైన్యాలు వెనుదిరిగిపోయే సమయంలో రవాణా సమస్య ఏర్పడింది. కార్లు ఉన్నవారందరూ ఈ అడవి ప్రాంతాన్ని ఎంచుకుని తమ కార్లను ఇక్కడ ఉంచి తర్వాత తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ కారుని తెచ్చుకోవడానికి కావాల్సిన సొమ్ముతో రెండు కార్లని కొనుక్కోవచ్చు.

అందుకని ఆ కార్లని అక్కడే వదిలేశారు. ఆ కార్లు అక్కడ అలా ఉండి ఎండకు ఎండి, వానకు తడిసి తుప్పు పట్టిపోయాయి. స్థానికులు, కార్ల వ్యాపారులు కొందరు ఆ కార్ల విడిభాగాలను తస్కరించుకుపోయారు. పర్యావరణ సమస్యలు తలెత్తడంతో బెల్జియం ప్రభుత్వం ఈ అడవిని నిషేధిత ప్రదేశంగా ప్రకటించింది.
 
 ఈ కథ నిజమేనా..?
 కొంతమంది చరిత్రకారులు ఈ కథ నిజం కాదని కొత్త వాదనను తెర పైకి తెచ్చారు. ఈ కార్లను పరిశీలిస్తే అవి 70 ఏళ్ల కిందటివి కాదని తెలిసిపోతుందని అంటున్నారు. చరిత్ర నిజమో, చరిత్రకారులు నిజమో తెలియాలంటే ఈ మిస్టరీ వీడక తప్పదు.

 

మరిన్ని వార్తలు