భారతీయులకు షాకిచ్చిన కువైట్‌

6 Jul, 2020 16:05 IST|Sakshi

ప్రవాసీ కోటా డ్రాఫ్ట్‌ బిల్లుకు జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం

విదేశీయుల్ని 30 శాతానికి తగ్గించుకునేందుకు బిల్లు

ప్రస్తుతం 70 శాతంగా ఉన్న ప్రవాసీలు

కువైట్‌: గల్ఫ్‌ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ కువైట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్‌ బిల్లుకు ఆదేశ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం గల్ఫ్‌ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్‌ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్‌లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్‌ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో 3 మిలియన్లకు పైగా (30 లక్షలు) ప్రవాసీయులే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపనున్నారు. (కువైట్‌ నుంచి సొంత రాష్ట్రానికి..)

కరోనా వైరస్‌ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక కువైట్‌లో ప్రవాసియుల సం‍ఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు.

ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది  ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అక్కడున్న కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు