హిమాలయన్‌ వయాగ్రా కోసం వెళ్లి 8 మంది మృతి!

7 Jun, 2019 10:59 IST|Sakshi

ఖాట్మాండు : అరుదుగా లభించే వనమూలిక, హిమాలయా వయాగ్రా పేరుగాంచిన ‘యార్సాగుంబా’  కోసం వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యార్సాగుంబా కోసం హిమాలయాలు ఎక్కిన 8 మందిలో ఐదుగురు ఆనారోగ్యంతో మరణించారని, ఇద్దరు అత్యంత ఖరీదైన వనమూలిక పీకే క్రమంలో కొండపై నుంచి జారిపడి తుదిశ్వాస విడిచారన్నారు. ఇక తన తల్లితో వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయడన్నారు. 

ఒక కిలో యార్సాగుంబా ధర రూ.60 లక్షల(లక్ష డాలర్ల) పైమాటే. గ్రామీణ నేపాల్‌లో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో మెజారిటీ కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. చాలా విలువైన మూలికలు కావడంతో వీటి కోసం ప్రాణాలకు తెగించి మరీ ఈ కుటుంబాలు పోరాడుతున్నాయి. హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలుపెడితే చాలు.. నేపాలీలు పచ్చిక బయళ్ల వైపు పరుగు తీస్తారు.. నెల రోజుల పాటు బంగారం కన్నా యార్సాగుంబా కోసం చిన్నాపెద్దా అంతా వేట సాగిస్తారు.  పసుపు పచ్చ రంగులో ఉండే ఇది బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలు ఈ మూలిక సొంతం. 

గొంగళిపురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగుల మాదిరిగా పెరిగే ఫంగస్సే ఈ యార్సాగుంబా. చైనాలో డాంగ్‌ ఛాంగ్‌ జియా కావో అనే రెండు తలల పురుగు ఉంటుంది. దీనిని వేసవి గడ్డి, చలికాలపు పురుగు అంటారు. శీతాకాలంలో యార్సాగుంబా పురుగులా ఉంటే.. వేసవి వచ్చేసరికి ఫంగస్‌ కారణంగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా తయారైన యార్సాగుంబా ఒక అగ్గిపుల్ల మాదిరిగా.. రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. యార్సాగుంబా సేకరించేవారి కోసం ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేసింది. చాలామంది సేకరణదారులు ఈ హెల్త్‌క్యాంప్‌ల్లో చికిత్స పొందారని అధికారులు వెల్లడించారు. నేపాల్‌ రాజధాని ఖట్మాండుకు 600 కిలోమీటర్ల దూరంలో ఉండే డోప్లా జిల్లాలో యార్సాగుంబా సేకరణదారులు ఎక్కువగా ఉంటారు.

మరిన్ని వార్తలు