ద.కొరియాలో కోవిడ్‌ తీవ్రం

1 Mar, 2020 01:15 IST|Sakshi
సియోల్‌లో డ్రైవర్‌ను చెక్‌చేస్తున్న వైద్యసిబ్బంది

తాజాగా 813 మందికి వైరస్‌

సియోల్‌/బీజింగ్‌: దక్షిణ కొరియాలో కోవిడ్‌ (కరోనా వైరస్‌) ఉధృతి పెరుగుతోంది. కోవిడ్‌ బారిన పడి, చికిత్స తర్వాత కోలుకున్న 73 ఏళ్ల మహిళ మళ్లీ ఈ వ్యాధి బారిన పడటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారం రోజుల క్రితమే డిశ్చార్జ్‌ అయిన ఆ మహిళ రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మరోసారి ఇన్ఫెక్షన్‌ బారిన పడిందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధికారులు తెలిపారు. శనివారం ద.కొరియాలో వ్యాధి బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం 3150 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ కాగా... వీరిలో 813 మందిని తాజాగా గుర్తించారు. కొత్తగా గుర్తించిన కేసుల్లో 90 శాతం దేగూ సిటీలోనివేనని, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు వ్యాధికి బలైనట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మరో 2.6 లక్షల మందికి వ్యాధినిర్థారణ పరీక్షలు జరగాల్సిన నేపథ్యంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి విజృంభణ నేపథ్యంలో దక్షిణ కొరియాలోS ఇప్పటికే పలు కార్యక్రమాలు రద్దయ్యాయి.

చైనాలో 2,835కి చేరిన మరణాలు
చైనాలో కరోనా వైరస్‌ ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. చైనా ఆరోగ్య కమిషన్‌ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. శుక్రవారం 47 మంది వ్యాధి కారణంగా మరణించగా మరో 427 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. కోవిడ్‌ కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 2,835 కాగా, నిర్ధారిత కేసుల సంఖ్య 79,251. డిసెంబరు రెండో వారం మొదలుకొని ఈ వ్యాధికి చికిత్స పొందిన వారిలో 39,002 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు