9 మంది ఐక్య రాజ్య సమితి సిబ్బందికి కరోనా!

1 Apr, 2020 13:48 IST|Sakshi
అలెసాండ్రా వెలుసి

జెనీవా: ప్రపంచ మానవాళికి దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా ఐక్య రాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది యూఎన్‌ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్‌ అలెసాండ్రా వెలుసి తెలిపారు. ఈమేరకు ఆమె ఓ లేఖలో పేర్కొన్నట్టు జిన్హువా వార్త సంస్థ మంగళవారం వెల్లడించింది. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఆమె స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్‌-19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు. 
(చదవండి: కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు)

కాగా, మార్చి 28న వెలుసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 78 మంది యూఎన్ సిబ్బందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జెనీవాలోని యూఎన్‌ కార్యాలయంతోపాటు.. అక్కడే ఉన్న అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందని ప్రకటించాయి. ఈనేపథ్యంలో యూఎన్‌ సిబ్బందిలో దాదాపు అందరూ ఇప్పుడు టెలీ వర్కింగ్‌ చేస్తున్నారు. కరోనా నియంత్రణకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ తమ కార్యాలయాలకు రాకుండా చూస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇక 85 లక్షల జనాభా ఉన్న స్విట్జర్లాండ్‌లో మంగళవారం ఉదయం వరకు 16,176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 373 మంది మరణించారు.
(చదవండి: గల్లీల్లో 'ఢిల్లీ')

మరిన్ని వార్తలు