తొమ్మిదేళ్లకే పోలీసు ఆఫీసర్!

13 Sep, 2016 17:28 IST|Sakshi
తొమ్మిదేళ్లకే పోలీసు ఆఫీసర్!

డాక్టర్ల లెక్క ప్రకారం చూస్తే.. అసలు ఈ పాటికి అతడు స్పృహలో కూడా ఉండకూడదు. కానీ అతడు మాత్రం తన కలలను నెరవేర్చుకుంటూ బ్రహ్మాండంగా పోలీసు కూడా అయ్యాడు. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మెదడు కేన్సర్‌తో బాదపడుతున్న కోలిన్ టోలండ్ అనే తొమ్మిదేళ్ల అబ్బాయి.. ఇప్పుడు అక్కడ పోలీసు అధికారి ఉద్యోగంలో చేరాడు. అవును.. అతడికి చిన్నప్పటి నుంచి పోలీసు అవ్వాలని కల ఉండేది. దాంతో అమెరికాలోని ఇటాకా పోలీసు శాఖ ముందుకొచ్చి అతడిని గౌరవ పోలీసు అధికారిగా నియమించింది.

అతడి కుటుంబ సభ్యులు, బోలెడంత మంది పోలీసులు, అతడి క్లాస్‌మేట్ల సమక్షంలో అతడిని గౌరవ పోలీసును చేసి యూనిఫాం కూడా ఇచ్చారు. తనకు అన్నింటికంటే ఇష్టమైనది బ్యాడ్జి మీద తన పేరు చూసుకోవడం అని ఈ సందర్భంగా కోలిన్ చెప్పాడు.  ఇప్పటికి అతడికి మూడుసార్లు మెదడుకు ఆపరేషన్ అయ్యింది. వైద్యుల లెక్కప్రకారం అయితే అసలు ఈపాటికి అతడు స్పృహలోనే లేకుండా ఉండాలి. కానీ అతడి మానసిక స్థైర్యం వల్లే ఇంతకాలం ఉన్నాడని, బతికున్న ప్రతిరోజూ జీవితాన్ని ఆస్వాదించడానికి లభించిన ఒక అవకాశంగా భావిస్తాడని కోలిన్ తల్లిదండ్రులు చెప్పారు. బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒక జోక్ వేసి నవ్వుతాడని అన్నారు.

కోలిన్ లాంటి ధైర్యవంతులు తమ శాఖలోకి రావడం తమకే గర్వకారణమని ఇతాకా పోలీసు చీఫ్ జాన్ బార్బర్ అన్నారు. ఇతాకా పోలీసు శాఖలో ఇప్పటివరకు చేసిన నియామకాలలో ఇదే అత్యుత్తమమని నగర మేయర్ స్వాంటే మిరిక్ చెప్పారు. అతడికి చాలా తక్కువ సమయం ఉన్నందున ఉద్యోగాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని.. అతడిని ఎవరూ మర్చిపోకూడదనే తాను భావిస్తున్నానని కోలిన్ తండ్రి అన్నారు.

మరిన్ని వార్తలు